How to Make Wheat Flour Spicy Sev Mixture: పిల్లలైనా, ఉద్యోగులైనా, ఇంట్లో ఉండే పెద్దలైనా.. ఈవెనింగ్ టైమ్‌లో ఏదో ఒక స్నాక్ తినాలనిపిస్తుంది. అలానే.. కొందరికి అప్పుడప్పుడు నోటికి ఏదైనా కాస్త పుల్లగా, కారంగా తినాలనిపిస్తుంది. అలాంటి సందర్భాల్లో చాలా సింపుల్‌గా కారప్పూస మిక్చర్ ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అద్దిరిపోతుంది. సాధారణంగా కారప్పూసను శనగపిండితో చేస్తుంటారు. అయితే ఇక్కడ మాత్రం శనగపిండి ప్లేస్‌లో గోధుమపిండి ఉపయోగించాలి. దీనిని ఈ పద్ధతిలో చేసి స్టోర్ చేసుకుంటే ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు హ్యాపీగా తినేయొచ్చు. మరి ఈ స్నాక్ ఐటమ్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు:
- గోధుమ పిండి - 2 కప్పులు
- బియ్యప్పిండి - అర కప్పు
- కారం - అర టీ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- పసుపు- పావు టీ స్పూన్
- ఇంగువ- పావు టీ స్పూన్
- ఆయిల్ - 2 టీ స్పూన్లు
మిక్చర్ కోసం:
- కరివేపాకు - 2 రెమ్మలు
- పల్లీలు- పావు కప్పు
- పుట్నాల పప్పు - పావు కప్పు
- జీడిపప్పు - 7
- వెల్లుల్లి - 5
- కార్న్‌ఫ్లేక్స్ - పావు కప్పు
- కారం - 1 టీస్పూన్
- ఉప్పు- పావు టీ స్పూన్
తయారీ విధానం:
- ముందుగా స్టీమ్ బౌల్ తీసుకుని అందులో కాటన్ క్లాత్‌ను పరచుకోవాలి. ఇప్పుడు ఆ క్లాత్లోకి గోధుమ పిండి, బియ్యప్పిండి వేసి క్లాత్‌ను క్లోజ్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో రెండు గ్లాసుల నీళ్లు పోసుకుని వేడి చేసుకోవాలి.
- నీళ్లు వేడెక్కిన తర్వాత ఈ స్టీమ్ బౌల్‌ను దానిపై ఉంచి మూత పెట్టాలి. స్టవ్‌ను మీడియం టు హై ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుని పది నిమిషాలు ఆవిరిపై ఉడికించాలి.
- ఆ తర్వాత స్టీమ్ బౌల్ నుంచి కాటన్ క్లాత్‌ను తీసుకుని మరో ప్లేట్లో పెట్టుకుని చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండిలో ఉండలు లేకుండా కలపాలి. ఆ తర్వాత ఈ పిండిని మరో గిన్నెలోకి జల్లించుకోవాలి.
- ఇప్పుడు అందులోకి కారం, ఉప్పు, పసుపు, ఇంగువ, నూనె వేసుకుని బాగా కలపాలి. ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని చపాతీ ముద్ద లాగా కలుపుకోవాలి.
- కారప్పూస మేకర్లో సన్నటి రంధ్రాలు కలిగిన బిళ్లను వేసుకోవాలి. అందులోకి గోధుమ పిండిని పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుని వేడి చేసుకోవాలి.
- ఆయిల్ వేడెక్కిన తర్వాత మేకర్ సాయంతో కారప్పూస మాదిరి ఒత్తుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. పిండి మొత్తాన్ని ఈ విధంగా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు అదే నూనెలో కరివేపాకు వేసి ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. అనంతరం పల్లీలు వేసి వేయించుకోవాలి.
- ఆ తర్వాత పుట్నాల పప్పు వేసి ఓ రెండు నిమిషాలు వేయించిన తర్వాత జీడిపప్పు వేసి వేయించి పక్కకు తీసుకోవాలి.
- ఆ తర్వాత కొద్దిగా దంచిన వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి. అనంతరం కార్న్‌ఫ్లేక్స్ వేసి వేయించుకోవాలి.
- ఇప్పుడు కారప్పూసను చేతితో నలుపుకోవాలి. అందులోకి ఉప్పు, కారం, వేయించిన వెల్లుల్లి వేసి బాగా కలపాలి.
- ఆ తర్వాత వేయించిన పల్లీలు, పుట్నాల పప్పు, జీడిపప్పు, కార్న్‌ఫ్లేక్స్, కరివేపాకు వేసి బాగా కలపాలి. అంతే ఎంతో రుచికరంగా ఉండే గోధుమపిండి కారప్పూస మిక్చర్ రెడీ. దీనిని గాలి చొరబడని డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
- తినాలనిపించినప్పుడు కొద్దిగా గిన్నెలోకి తీసుకుని అందులోకి కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే రుచి ఇంకా బాగుంటుంది. మరి నచ్చితే మీరూ ఓ సారి ట్రై చేయండి.
సూపర్ స్నాక్ రెసిపీ "కోడిగుడ్డు కజ్జికాయలు" - ఈ పద్ధతిలో చేస్తే ఒక్కటీ మిగలదు!
కరకరలాడే "ఎగ్ కట్లెట్స్" - నిమిషాల్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి - టేస్ట్ వేరే లెవల్ అంతే!