Chicken Kebab Recipe in Telugu : పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినే స్ట్రీట్ ఫుడ్స్‌లో ఒకటి కబాబ్. ఈ క్రమంలోనే చాలా మంది వీకెండ్స్, ఆదివారం.. అలా రెస్టారెంట్స్‌కి వెళ్లినప్పుడు ఎక్కువగా చికెన్ కబాబ్స్ ఆర్డర్ చేస్తుంటారు. అయితే, అదే కబాబ్స్‌ని ఇంట్లోనే పిల్లలకు చేసి పెడుదామని ప్రయత్నిస్తుంటారు కొందరు. కానీ, పర్ఫెక్ట్గా కుదరవు. అలాగే అంత రుచికరంగానూ రావట్లేదని బాధపడుతుంటారు. అయితే, ఈసారి "చికెన్ కబాబ్స్" ఇలా చేసి చూడండి. రుచిలో రెస్టారెంట్ టేస్ట్‌కి ఏమాత్రం తీసిపోవు! పైగా వీటిని ప్రిపేర్ చేసుకోవడం కూడా సులువు! ఇంతకీ, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- చికెన్ కీమా - అరకేజీ
- తరిగిన ఉల్లిపాయలు - రెండు
- అల్లంవెల్లుల్లి పేస్టు - 2 టీస్పూన్లు
- చాట్ మసాలా - 1 టీస్పూన్
- కారం - 1 టేబుల్‌స్పూన్
- సన్నగా తరిగిన పచ్చిమిర్చి - 4
- గరంమసాలా - అరటేబుల్‌స్పూన్
- ఉప్పు - రుచికి తగినంత
- గుడ్డు - 1
- మిరియాలపొడి - 1 టేబుల్‌స్పూన్
- కొత్తిమీర తరుగు - 2 టేబుల్‌స్పూన్లు
- పుదీనా తరుగు - 2 టేబుల్‌స్పూన్లు
- బటర్ - 2 టేబుల్‌స్పూన్లు
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా కబాబ్స్టిక్స్ని ఓ అరగంట పాటు నీటిలో నానబెట్టాలి. ఇలా చేయడం ద్వారా పెనం మీద కాల్చుకునేటప్పుడు మాడకుండా ఉంటాయి.
- ఇప్పుడు ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో చికెన్‌కీమా, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు, అల్లంవెల్లుల్లి పేస్టు, కారం, చాట్ మసాలా, గరంమసాలా, ఉప్పు, మిరియాలపొడి, కొద్దిగా కొత్తిమీర, పుదీనా తరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై బౌల్ మీద మూతపెట్టి అరగంటసేపు అలా వదిలేయాలి.
- ఆ తర్వాత దాంట్లో గుడ్డు సొనను వేసి కలుపుకోవాలి. అయితే, గుడ్డు ఇష్టంలేనివాళ్లు 1 టీస్పూన్ శనగపిండిని యాడ్ చేసుకోవచ్చు.
- అనంతరం చేతులను తడి చేసుకుని మీరు కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని నిమ్మకాయ సైజులో చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి.
- తర్వాత వాటిని అరగంట పాటు నీటిలో నానబెట్టుకున్న కబాబ్స్టిక్స్కు అంటించుకుని పొడవుగా స్ప్రెడ్ చేసుకోవాలి.
- అనంతరం స్టౌపై మందపాటి పెనం పెట్టుకొని వేడి చేసుకోవాలి. అది వేడయ్యాక బటర్ వేసి కరిగించుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఐదారు కబాబ్స్టిక్స్ పెట్టి లో ఫ్లేమ్ మీద 8 నుంచి 10 నిమిషాల పాటు రెండువైపులా కాల్చుకోవాలి.
- అవి క్రిస్పీగా మారాయనుకున్నాక తీసి వాటిపైన కొద్దిగా కొత్తిమీర, పుదీనా తరుగు, చాట్‌మసాలా చల్లుకుని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చికెన్ కబాబ్స్ రెడీ!
- ఇక వీటిని గ్రీన్‌చట్నీ లేదా టమాటాసాస్‌తో వేడివేడిగా తింటుంటే కలిగే ఆ ఫీలింగ్ సూపర్‌గా ఉంటుంది.
- మరి, నచ్చిందా.. అయితే, మీరు ఈ వీకెండ్ మీ పిల్లలకు ఇలా చేసి ఇవ్వండి. ఎంతో ఇష్టంగా తింటారు!
ఎప్పుడూ ఒకేలా కాకుండా ఓసారి ఇలా "చిల్లీ చికెన్" చేసుకోండి - ముక్క మిగల్చకుండా తినేస్తారంతే!