These Foods That Have More Calcium Than Milk : పాలు సంపూర్ణ పోషకాహారం. కానీ.. కొందరు పాలు, పాల పదార్థాలను తీసుకోవడానికి ఇష్టపడరు. మరికొందరు పాలు కల్తీ అవుతున్నాయని తాగట్లేదు. ఇలాంటి వారిలో సహజంగానే కాల్షియం లోటు కనిపిస్తుంది. ఇలాంటి వారు వేరే పదార్థాలు తినడం ద్వారా కాల్షియం లోటును పూడ్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆ ఆహార పదార్థాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మునగాకు : ఇందులో కాల్షియం అత్యధికంగా ఉంటుందని చెబుతున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్ అంజలీ. పాల పదార్థాలు పడని వారు మునగాకును పప్పు, కూరలు, రోటి పచ్చడి.. ఎలా తయారు చేసుకొని తిన్నా.. అద్భుత ప్రయోజనం ఉంటుందంటున్నారు. మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల నుంచి బిగ్ రిలీఫ్ లభిస్తుందని చెబుతున్నారు. మునగ చెట్లు ఇళ్ల చుట్టూ కనిపిస్తూనే ఉంటాయి. కాయలు కోస్తే ఎవరైనా వద్దంటారేమోగానీ.. ఆకులు కోసుకుంటే ఎవ్వరూ వద్దని చెప్పరు. కాబట్టి.. తరచుగా మునగాకు తినాలని సూచిస్తున్నారు.
రాగులు : మీకు పాలు ఇష్టం లేకపోతే రాగులను మీ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా తగినంత కాల్షియం పొందవచ్చంటున్నారు డాక్టర్ అంజలీ దేవి. 100 గ్రాముల రాగుల్లో 300 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి.. రాగులు(National Library of Medicine రిపోర్టు) తీసుకోవడం ద్వారా కాల్షియం సమృద్ధిగా లభించి ఎముకలు బలంగా తయారవుతాయంటున్నారు.
గుమ్మడి గింజలు : మీరు మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లయితే గుమ్మడి గింజలను తీసుకుంటే మంచి ప్రయోజం లభిస్తుందంటున్నారు. పాలు ఇష్టపడని వారు వీటిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఎక్కువ మొత్తంలో కాల్షియం లభించి ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుందంటున్నారు.
గసగసాలు : ఒక టేబుల్ స్పూన్ (20 గ్రాములు) గసగసాలు తీసుకుంటే ఒక గ్లాసు పాలు తాగినట్లే అంటున్నారు డాక్టర్ అంజలీ. అంటే.. 300 మిల్లీ గ్రాముల కాల్షియం శరీరానికి అందినట్లే అని చెబుతున్నారు. అలాగే.. వీటిలో కాల్షియంతో పాటు మాంగనీస్, ప్రొటీన్లు, కాపర్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయంటున్నారు.
చియా గింజలు : కాల్షియం సమృద్ధిగా లభ్యమయ్యే పదార్థాల్లో చియా కూడా ఒకటి. వీటిని ప్రత్యేకంగా వేయించుకునైనా తినచ్చు లేదా ఓట్స్‌తో కలిపి తినచ్చు. 45 గ్రాముల చియా గింజల్లో 300 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుందని చెబుతున్నారు.
ఈ లక్షణాలు మీలో కనిపించాయా? అయితే మీకు కాల్షియం తక్కువున్నట్టే!
పాలకూర : దీనిలోనూ ఎక్కువ మొత్తంలో కాల్షియం ఉంటుంది. కాబట్టి పాలు అంటే ఇష్టపడని వారు పాలకూరను ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే కావాల్సిన మొత్తంలో కాల్షియం పొందవచ్చంటున్నారు.
టోఫు : సోయా పాలతో ప్రిపేర్ చేసే పన్నీరునే టోఫు అని అంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఇందులో కాల్షియం సమృద్ధిగా లభిస్తుందంటున్నారు డాక్టర్ అంజలీ.
వీటిల్లో కూడా..
పూల్ మఖానా, జీడిపప్పు, ఖర్జూరం, తోటకూర గింజలు, క్యాబేజీతో పాటు కొన్ని ఆకుపచ్చని కూరగాయలను డైట్‌లో చేర్చుకోవడం వల్ల పుష్కలంగా కాల్షియం ప్రయోజనాలను పొందవచ్చంటున్నారు నిపుణులు. అదేవిధంగా.. కిడ్నీ బీన్స్ లేదా రాజ్‌మా, మెంతి కూర, సోయా బీన్స్, బాదం పప్పు, బ్రకలీ, చిలగడదుంప, బెండకాయ, పొద్దుతిరుగుడు గింజలు, నారింజ పండ్లు కూడా కాల్షియంతో నిండినవేనని సూచిస్తున్నారు.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
కాల్షియం లోపమా? ట్యాబ్లెట్స్ కన్నా ఈ ఫుడ్ తినడం చాలా బెటర్!