Most Cinemas Watched World Record : మీరు రోజుకు ఎన్ని సినిమాలు చూస్తారు? అని ప్రశ్నిస్తే.. వారానికి ఒక సినిమా చూస్తే ఎక్కువే అంటారు మెజారిటీ జనం. కొందరు సినీ ప్రియులైతే వీకెండ్లో సినిమా ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. కానీ.. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం సినిమాలు చూడడాన్ని ఓ యుద్ధంలా చేస్తున్నాడు. పరిస్థితిని బట్టి రోజుకు మూడ్నాలుగు సినిమాలు కూడా చూసేస్తున్నాడు. మరి.. అతడు ఇలా ఎందుకు చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.
నిత్యం సినిమాలతో గడిపేస్తున్న ఆ వ్యక్తిపేరు జాక్ స్వోప్. వయసు 32ఏళ్లు. అమెరికాకు చెందిన ఈ వ్యక్తికి సినిమాలు అంటే విపరీతమైన ఇష్టం. దీంతో ఈ సినిమాలతోనే ప్రపంచ రికార్డు సృష్టించాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఓ వైపు తన ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు థియేటర్లలో సినిమాలు చూడడం ప్రారంభించాడు. ఉదయం 6.45 నుంచి మధ్యాహ్నం 2.45 దాకా ఉద్యోగం చేసేవాడు. ఆ తర్వాత వీలైన సమయంలో సినిమాలు చూసేవాడు. రోజుకు 3 సినిమాలు చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సెలవు రోజుల్లో అంతకు మించి చూసేవాడు. ఈ విధంగా.. సరిగ్గా ఏడాది పూర్తయే సరికి ఏకంగా 777 సినిమాలు చూశాడట! మొదటగా 'మిలియన్స్: రైజ్ ఆఫ్ గ్రూ' అనే సినిమాతో ప్రయాణాన్ని ప్రారంభించిన స్వోప్.. 'ఇండియానా జోన్స్ అండ్ డయల్ ఆఫ్ డెస్టినీ'తో పూర్తి చేశాడు. ఫలితంగా ప్రపంచంలోనే ఏడాది కాలంలో అత్యధిక సినిమాలు చూసిన వ్యక్తిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాడు.
సీరియస్‌గా..
అయితే.. సినిమాలు చూడడం అంటే.. ఇంట్లో కూర్చొని టైంపాస్ చేయలేదు. ఖచ్చితంగా థియేటర్‌కే వెళ్లేవాడు. అక్కడ కూడా చాలా సీరియస్‌గా సినిమాలు చూసేవాడట. సినిమాలు చూసే సమయంలో మరొక పని ఏదీ కూడా చేసేవాడు కాదు. అంటే.. కనీసం ఫోన్ చూడడం లేదా నిద్రపోవడం లాంటి పనులు చేసేవాడు కాదట. అలాగే.. తినడం, తాగడం లాంటివి కూడా చేయలేదట. ఇలాంటి నిబంధనలన్నీ పాటించాడని నిర్ధరించుకున్న తర్వాతనే గిన్నిస్ బుక్ యాజమాన్యం జాక్ స్వోప్ పేరును రికార్డుల్లో నమోదు చేసింది.
ఎందుకోసమో తెలుసా?
అయితే.. ఆటిజంపై అవగాహన పెంచడం కోసం ఈ పని చేశాడట జాక్ స్వోప్. "ఆటిజం కారణంగా నేను గతంలో ఆత్మహత్యాయత్నం కూడా చేశాను. కానీ తర్వాత అది సరికాదని తెలుసుకున్నాను. ఈ సమస్య నుంచి బయటపడడం కోసం సినిమాలు చూడడం ప్రారంభించి రికార్డు సాధించాలని నిర్ణయించుకున్నా. అందుకే ఇలా చేయడం ప్రారంభించాను. భవిష్యత్తులో ఏడాదికి 800 సినిమాలు చూసి నా రికార్డును నేనే బద్దలుకొట్టాలని భావిస్తున్నా" అని స్వోప్ చెప్పాడు. ఇక ఈ రికార్డును సాధించినందుకు గాను అమెరికాలోని ఆత్మహత్య నివారణ సంస్థ జాక్ స్వోప్‌కు సుమారు రూ.6లక్షలను (7,777.77 డాలర్లు) బహుమతిగా ఇచ్చింది.
అయితే, అంతకుముందు ఈ రికార్డు ఫ్రాన్స్‌కు చెందిన విన్సెంట్ క్రోన్ పేరు మీద ఉండేది. అతడు 715 సినిమాలు చూసి ఈ రికార్డును నెలకొల్పాడు. తాజాగా ఇప్పుడు 777 సినిమాలు చూసి దాన్ని తిరగరాశాడు జాక్ స్వోప్. భవిష్యత్తులో ఏడాదికి 800 సినిమాలు చూసి తన రికార్డును తానే బద్దలుకొడతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.