Indian Students In USA : అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అత్యధికంగా ఉన్నారని తాజాగా విడుదలైన ఓపెన్ డోర్స్ నివేదిక ద్వారా వెల్లడైంది. అమెరికాలో 2023-24 విద్యా సంవత్సరంలో ఏకంగా 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారని, గత 15 ఏళ్లలో ఇదే అత్యధికమని ఓపెన్ డోర్స్ సంస్థ పేర్కొంది. ఈ విధంగా అమెరికాకు అత్యధికంగా విద్యార్థులను పంపిన దేశంగా భారత్ నిలిచిందని తెలిపింది.
ఓపెన్ డోర్స్ రిపోర్ట్ ప్రకారం
- 2022-23 విద్యా సంవత్సరంలో అమెరికాకు వెళ్లి చదువుకున్న విదేశీ విద్యార్థుల్లో చైనా స్టూడెంట్స్ ఎక్కువగా ఉండగా, వారి తరువాతి స్థానంలో భారతీయ విద్యార్థులు ఉన్నారు. కానీ 2023-24 విద్యా సంవత్సరంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
- 2022-23లో యూఎస్‌లో 2,68,923 మంది ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు. అయితే 2023-24 విద్యా సంవత్సరంలో యూఎస్‌లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 3,31,602కు పెరిగింది. 2022-23 విద్యా సంవత్సరంతో పోలిస్తే ఇది 23 శాతం ఎక్కువ కావడం గమనార్హం.
- ఓపెన్ డోర్స్ రిపోర్ట్ 2024పై యూఎస్ ఎంబసీ షేర్ చేసిన నోట్ ప్రకారం, యూఎస్‌లో ఉన్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌లో భారతీయ విద్యార్థులు 29 శాతం వరకు ఉన్నారు. అంటే సంఖ్య పరంగా చూస్తే భారతీయ విద్యార్థులే ప్రథమ స్థానంలో ఉన్నారు.
- తాజా రిపోర్ట్‌లోని అధికారిక డేటా ప్రకారం, 2023-24 విద్యా సంవత్సరంలో అమెరికాకు ఎక్కువ సంఖ్యలో విద్యార్థులను పంపిన టాప్ 5 దేశాలు ఏమిటంటే? అవి:
1. భారత్ (3,31,602)
2. చైనా (2,77,398)
3. దక్షిణ కొరియా (43,149)
4. కెనడా (28,998)
5. తైవాన్ (23,157)
- "2008-2009 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే, ఇండియా మొదటిసారి 3,31,602 మంది విద్యార్థులను అమెరికాకు పంపించి తొలి స్థానంలోకి వచ్చింది. ఇది ఆల్-టైమ్ హై" అని యూఎస్ ఎంబసీ పేర్కొంది.
- సాధారణంగా అమెరికాలో విద్యా సంవత్సరం సెప్టెంబర్‌లో మొదలై మే నెలతో ముగుస్తుంది.
- అమెరికాకు అత్యధిక సంఖ్యలో గ్రాడ్యుయేట్ (మాస్టర్స్, పీహెచ్డీ) స్థాయి విద్యార్థులను పంపిన దేశంగానూ భారత్ నిలిచింది. గతేడాదితో పోల్చితే ఇండియన్ గ్రాడ్యుయేట్స్ సంఖ్య 19 శాతం పెరిగి 1,96,567కు చేరింది.
- ఇండియా నుంచి అమెరికాకు వెళ్లిన అండర్ గ్రాడ్యుయేట్స్ సంఖ్య కూడా 13 శాతం పెరిగి 36,053కు చేరింది. అయితే నాన్-డిగ్రీ స్టూడెంట్స్ సంఖ్య మాత్రం 28 శాతం తగ్గి 1,426కు పడిపోయింది.
- ఈ ఓపెన్ డోర్స్ నివేదికను ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ (ఐఐఈ) ప్రచురించింది. ఐఐఈ 1919లో స్థాపితమైనప్పటి నుంచి అమెరికాలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థుల వార్షిక గణాంకాల సర్వేను నిర్వహిస్తోంది. 1972 నుంచి ఇది యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ అఫైర్స్ భాగస్వామ్యంతో పనిచేస్తోంది.