Hamas Chief Sinwar Autopsy Report : హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ మృతదేహానికి నిర్వహించిన శవ పరీక్షలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిన్వర్ తలపై బుల్లెట్ గాయం, ఎడమ చేతికి ఒక వేలు కత్తిరించినట్లు ఉన్నట్లు నివేదికలో వెల్లడించారు. ఇదిలా ఉండగా హమాస్ తదుపరి అధినేతగా సిన్వర్ తమ్ముడు మహమ్మద్ సిన్వర్ పేరు వినిపిస్తోంది.
బుల్లెట్ గాయం వల్లే మృతి
మూడు నెలలో వ్యవధిలో హమాస్‌కు చెందిన ఇద్దరు అగ్రనేతలను ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టాయి. జూలైలో హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియేను అంతమెుందించిన ఇజ్రాయెల్ తాజాగా మరో అధినేత యాహ్యా సిన్వర్‌ను ముట్టుబెట్టాయి. అక్టోబర్ 16న దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడిలో హమాస్ అధినేత మృతి చెందారు. అయితే సిన్వర్ తలపై బుల్లెట్ గాయం ఉందని, ఎడమ చేతికి ఒక వేలు కత్తిరించినట్లు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైనట్లు న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది. తలకి తగిలిన బుల్లెట్ కారణంగానే సిన్వర్ మరణించి ఉండచ్చని పోస్టుమార్టం నిర్వహించిన ఇజ్రాయెల్ వైద్యుడు డాక్టర్ చెన్ కుగేల్ పేర్కొన్నారు. సిన్వర్ చేతికి గాయమైందని వెల్లడించారు. ట్యాంక్ లేక మిస్సైల్ నుంచి వచ్చిన షెల్ వల్ల ఆ గాయమై ఉండొచ్చని చెప్పారు. రక్తాన్ని ఆపేందుకు సిన్వర్ చేతిచుట్టూ ఒక వైర్‌ను చుట్టుకున్నట్లు కుగేల్ తెలిపారు. గన్‌షాట్ వల్ల మరణించారని వెల్లడించారు.
డీఎన్ఏ పరీక్ష కోసమే చేతి వేలు
సిన్వర్ మృతిని ధ్రువీకరించుకునేందుకు డీఎన్ఏ పరీక్ష కోసం ఇజ్రాయెల్ బలగాలు ఆయన చేతి వేలును కత్తిరించినట్లు సీఎన్ఎన్ కూడా ఇదే తరహా కథనాన్ని ప్రచురించింది. మృతుల్లో ఒకరికి సిన్వర్ పోలికలు ఉన్నట్లు అనుమానం రావడం వల్లే ఈ పరీక్షలు నిర్వహించనట్లు పేర్కొంది. సిన్వర్ ఇజ్రాయెల్ జైల్లో ఉన్నప్పుడు సేకరించిన డీఎన్ఏ ప్రొఫైల్‌తో పోల్చగా ఆ మృతదేహం ఆయనదేనని ధ్రువీకరించుకున్నట్లు కుగేల్‌ను ఉటంకిస్తూ సీఎన్ఎన్ కథనం వెల్లడించింది. సిన్వర్ దంతాలను కూడా కత్తిరించినట్టు పేర్కొంది. మెదట దంతాలను పరీక్షంగా తెలియలేదని తర్వాత వేలును పరీక్షంగా సిన్వర్ డీఎన్ఏతో సరిపోయిందని కుగేల్ చెప్పినట్లు కథనాన్ని ప్రచురించింది.
సిన్వర్ ఉన్న భవనంలోకి ఇజ్రాయెల్ సైనికులు ప్రవేశించే ముందు ట్యాంక్ లేక మిస్సైల్ ఆ భవనంపై దాడులు చేశారు. అప్పటికే శిథిలావస్థకు చేరుకున్న ఆ భవనం దాడులతో పూర్తిగా నాశనమైంది. నష్టాన్ని అంచనా వేసేందుకు ఇజ్రాయెల్ దళాలు భవనంలోకి వెళ్లగా ఏకే అసాల్ట్ రైఫిల్స్, ఎస్వీడీ డ్రాగునోవ్ స్నైపర్ రైఫిల్, మ్యాగజైన్లు, ప్రత్యక్ష మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
తదుపరి అధినేతగా సిన్వర్ తమ్ముడు
సిన్వర్ మృతితో ఇప్పుడు హమాస్ గ్రూప్‌ను ముందుండి నడిపించేదెవరనే చర్చ మొదలైంది. సిన్వర్ తమ్ముడు మహ్మమద్ సిన్వర్ హమాస్ తదుపరి అధినేతగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. హమాస్ మిలిటరీ వింగ్‌లో సుదీర్ఘకాలంగా పని చేస్తున్న మహమ్మద్ ఆ గ్రూప్‌లో కీలక వ్యక్తి. 2011లో ఇజ్రాయెల్ సైనికుడు గిలాద్ షలిత్‌ను మహమ్మద్ సిన్వర్ బంధించి తన అన్నను జైలు నుంచి విడిపించుకున్నాడు. తమ సైనికుడిని క్షేమంగా తెచ్చుకునేందుకు యాహ్యా సిన్వర్‌తో పాటు దాదాపు వెయ్యి మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయాల్సి వచ్చింది. అతడు నాయకత్వ బాధ్యతలు చేపడితే గ్రూప్ వ్యూహాలు యథావిధిగా కొనసాగుతాయని భావిస్తున్నారు. అయితే శాంతి చర్చలు మరింత సవాలుగా మారొచ్చని అమెరికా అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పెద్దగా బయటకు కనిపించని ఇతడు ఇజ్రాయెల్ నిర్వహించిన పలు ఆపరేషన్లలో త్రుటిలో ప్రాణాల నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం ఇతడి కోసం నెతన్యాహు సేనలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. సిన్వర్ బాధ్యతలను హమాస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన మహమ్మద్ అల్ జహర్ స్వీకరించే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి.