US Warns India After Chabahar Port Agreement : చాబహార్ పోర్ట్ నిర్వహణకు సంబంధించి ఇండియా, ఇరాన్‌ల మధ్య తాజాగా కీలక ఒప్పందం కుదిరింది. భారత్ ఈ డీల్ చేసుకోవడంపై అగ్రరాజ్యం అమెరికా గుర్రుగా ఉంది. ఇరాన్‌తో వ్యాపార లావాదేవీలు జరిపే ఏ దేశంపైన అయినా తాము ఆంక్షలకు వెనుకాడబోమని భారతదేశాన్ని పరోక్షంగా హెచ్చరించింది.
ఆంక్షలు తప్పవు!
అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ భారత్- ఇరాన్ డీల్ గురించి ప్రస్తావించారు. 'చాబహార్ ఓడరేవు నిర్వహణ కోసం ఇండియా, ఇరాన్ దేశాల మధ్య ఒప్పందం కుదిరిందని మాకు తెలిసింది. ఇరాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలు నెరపడం గురించి, తమ విదేశాంగ విధాన లక్ష్యాల గురించి భారత్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం కచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇరాన్‌పై అమెరికా ఇప్పటికే పలు ఆంక్షలు విధించింది. వాటిని అమలు చేస్తూ ఉంది. అందువల్ల ఏ సంస్థ అయినా లేక ఏ దేశమైనా ఇరాన్‌తో వ్యాపార లావాదేవీలు జరిపితే, వారు కూడా ఆంక్షల ఛట్రంలో ఇరుక్కునే ప్రమాదం ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దీని గురించి మేం ఇప్పటికే చాలా సార్లు స్పష్టం చేశాం' అని వేదాంత్ పేర్కొన్నారు.
చాబహార్ పోర్ట్ ప్రధాన్యత ఏమిటి?
మధ్య ఆసియా దేశాలతో భారత్ వ్యాపార, వాణిజ్యాలు చేయడానికి చాబహార్ పోర్టు ప్రధాన మార్గంగా ఉంది. దీని ద్వారా కజకిస్థాన్, కిర్గిజ్ రిపబ్లిక్, తజికిస్థాన్, తుర్కెమెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్ లాంటి పలు దేశాలకు భారత్ నుంచి సరకు రవాణా చేయవచ్చు. అఫ్గానిస్థాన్‌కు భారత్ అందించే ఆహార ధాన్యాలను కూడా ఈ చాబహార్ పోర్ట్ మార్గంలోనే పంపిస్తున్నారు. అందుకే వ్యూహాత్మకంగానూ అత్యంత కీలకమైన ఈ ఓడరేవులో 10ఏళ్ల పాటు టర్మినెల్ నిర్వహణ కోసం భారత్, ఇరాన్ సోమవారం ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని వల్ల ఈ ప్రాంతంలోని వివిధ దేశాల మధ్య అనుసంధానం పెరుగుతుంది. ద్వైపాక్షిక బంధాలు కూడా మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది.
ఉత్తర కొరియాలో రెడ్ లిప్‌స్టిక్‌పై నిషేధం- కారణం ఏమిటో తెలుసా? - kim lipstick ban
హింసతో దద్దరిల్లుతున్న POK- 'భారత్ వెంటనే జోక్యం చేసుకోవాల్సిందే!' - POK Protest Against Pakistan