US Elections JD Vance Wife Usha : రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరు ఖరారు కాగా, ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్(39) పేరును ప్రకటించారు. ఆయన ఒహాయో రాష్ట్ర రిపబ్లికన్ పార్టీ సెనేటర్. ప్రత్యేకమైన విషయం ఏమిటంటే వాన్స్ సతీమణి భారత సంతతి వ్యక్తి కావడం, ముఖ్యంగా తెలుగు సంతతి వ్యక్తం కావడం విశేషం. ఆమె పేరు ఉషా చిలుకూరి వాన్స్.
భారత్ నుంచి వలస వెళ్లి
ఉషా చిలుకూరి వాన్స్ తల్లిదండ్రులు చాలా ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో ఉషా చిలుకూరి జన్మించారు. ఆమె న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. 2015 నుంచి న్యాయ సేవల సంస్థలు ముంగర్, టోల్స్, ఓస్లాన్‌లో కార్పొరేట్ లిటిగేటర్‌గా ఉషా చిలుకూరి పనిచేస్తున్నారు. అంతకుముందు 2013 సంవత్సరంలో యేల్ యూనివర్సిటీలో లా చేస్తుండగా ఉషాకు జేడీ వాన్స్ పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. లా కోర్సు పూర్తయ్యాక ఇద్దరూ 2014లో కెంటకీలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు ఇవాన్, వివేక్, కుమార్తె పేరు మిరాబెల్.
రాజకీయాల్లో భర్తకు అండగా
మొదటినుంచీ రాజకీయాల్లో జేడీ వాన్స్‌కు ఉషా చిలుకూరి అండగా నిలుస్తున్నారు. రెండేళ్ల క్రితం(2022లో) ఒహాయో సెనేటర్‌గా జేడీ వాన్స్ పోటీ చేసిన సమయంలోనూ ఆయన తరఫున ఎన్నికల ప్రచారంలో కీలక బాధ్యతలను నిర్వర్తించారు. ఆ ఎన్నికల్లో గెలిచి వాన్స్ తొలిసారిగా అమెరికా సెనేట్‌కు ఎన్నికయ్యారు. వాస్తవానికి లా కోర్సు పూర్తిచేసిన అనంతరం కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఎంఫిల్ చేసేటప్పుడు ఉషా చిలుకూరి డెమొక్రటిక్ పార్టీ సభ్యురాలిగా ఉన్నారు. అప్పట్లో ఆమె లెఫ్ట్ వింగ్, లిబరల్ గ్రూప్స్‌తో కలిసి పనిచేశారు. అయితే వివాహం జరిగాక ఉష పార్టీ మారారు. భర్త జేడీ వాన్స్ సలహా మేరకు రిపబ్లికన్ పార్టీలో చేరారు.
తొలుత ట్రంప్‌ను వ్యతిరేకించి
జేడీ వాన్స్ మెరైన్ విభాగంలో అమెరికాకు సేవలందించారు. ఒహాయో స్టేట్ యూనివర్సిటీ, యేల్ లా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడయ్యారు. యేల్ లా జర్నల్‌కు కొంతకాలం సంపాదకుడిగా ఉన్నారు. వాన్స్ మొదట్లో రిపబ్లికన్ పార్టీలో ఉంటూనే ట్రంప్ విధానాలను బహిరంగంగా విమర్శించేవారు. అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్ ఫిట్ కారు అని కామెంట్స్ చేసేవారు. కొన్నేళ్ల క్రితం ఆకస్మిక మార్పుతో ట్రంప్ విధేయుడిగా జేడీ వాన్స్ మారిపోయారు.
జేడీ వాన్స్ మంచి రచయిత. ఆయన రాసిన 'హిల్‌బిల్లీ ఎలెజీ' పుస్తకం అత్యధికంగా అమ్ముడుపోయింది. దీని ఆధారంగా సినిమా కూడా తీశారు. ఈ పుస్తక రచనలోనూ భర్తకు ఉష చాలా సహకరించారు. సాంకేతి, ఆర్థిక సేవల వ్యాపారాల్లోనూ ఉష భర్త చాలా సక్సెస్ అయ్యారు.
చందమామపై గుహను గుర్తించిన సైంటిస్టులు- ఫ్యూచర్లో మనుషులు ఉండొచ్చు!
ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్ షాక్ - మాజీ ప్రధాని పార్టీపై పాక్ ప్రభుత్వం నిషేధం!