US Elections Biden : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై పోటీ నుంచి డెమోక్రాటిక్ పార్టీ నామినీ అభ్యర్థి జో బైడెన్ వైదొలగాలన్న డిమాండ్లు రోజురోజుకూ బలపడుతున్నాయి. సొంత పార్టీలోని కీలక ప్రతినిధులు ఆయన వైదొలగాలని పట్టుబడుతున్నారు. ప్రతినిధుల సభలోని మైనారిటీ నేత హకీం జెఫరీస్ ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో చాలా మంది బైడెన్ నిష్క్రమించాలని అభిప్రాయపడినట్లు సమాచారం. కొంతమంది ఆయనకు మద్దతుగా నిలిచినవారు కూడా ఉన్నారని తెలుస్తోంది.
డిబేట్ తర్వాతే!
ట్రంప్‌తో డిబేట్లో బైడెన్ తడబడిన తర్వాత ఆయన అభ్యర్థిత్వంపై వివిధ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతినిధుల సభలో మళ్లీ మెజారిటీ సాధించాలంటే బైడెన్ పోటీలో ఉండొద్దని పలువురు కీలక నేతలు అభిప్రాయపడ్డట్లు సమావేశంలో పాల్గొన్న వర్గాలు వెల్లడించాయి. ఆయన వల్ల అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ గెలుపు అవకాశాలు సన్నగిల్లే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ట్రంప్ నుంచి దేశాన్ని రక్షించాలంటే బలమైన నేతను బరిలో నిలపాల్సిన అవసరం ఉందని కొందరు అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది.
ఏదో ఒకటి తేలే అవకాశం!
బైడెన్ వైదొలగితే కమలా హ్యారిస్‌ను పోటీలో ఉంచాలని రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో చాలా మంది నేతలు అభిప్రాయపడ్డారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆమె బరిలో ఉంటే ట్రంప్‌ను ఓడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. చాలా మంది బైడెన్ నిష్క్రమణకు పట్టుబట్టాలని ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం జరగనున్న కాకస్ సమావేశంలో ఏదో ఒకటి తేలే అవకాశం ఉందట. బైడెన్‌కు ఉన్న అనుభవం, ప్రతిష్ఠ నేపథ్యంలో బరి నుంచి దూరం జరిగే ప్రక్రియ సజావుగా సాగితే బాగుంటుందని భావిస్తున్నట్లు కొందరు వివరించారు.
బైడెన్ మాత్రం!
అయితే బైడెన్ మాత్రం తన ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ తానే అధ్యక్ష అభ్యర్థినని బలంగా చెబుతున్నారు. డెమోక్రాట్లు మొత్తం తన వెంటే ఉన్నట్లు ఉద్ఘాటిస్తున్నారు. మరోవైపు ఆయనకు అత్యంత సన్నిహితుడు, హవాయి గవర్నర్ జోష్ గ్రీన్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. పోటీలో ఉండాలా? లేదా? అనే విషయంపై కొన్ని రోజుల్లో బైడెన్ తన నిర్ణయం వెల్లడిస్తారని తెలిపారు. అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలని బైడెన్ భావిస్తే ఆ స్థానంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను ఆయన ప్రతిపాదించే అవకాశం ఉందని కూడా వెల్లడించడం గమనార్హం.
'దేవుడు తప్ప నన్ను ఎవరూ పోటీ నుంచి తప్పించలేరు!' - బైడెన్
తడబాటు X దూకుడు- అమెరికా ప్రజాస్వామ్యానికి పరీక్ష - US Election 2024 Biden VS Trump