Republican VP Candidate JD Vance : అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరుకు ఆమోదం లభించింది. మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధులంతా ఆయన అభ్యర్థిత్వానికి సమ్మతించారు. అదే సమయంలో ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహాయో సెనేటర్‌గా జేడీ వాన్స్ పేరును ట్రంప్ ప్రకటించారు. ఫలితంగా నవంబరులో జరగబోయే ఎన్నికకు పార్టీ తరఫున కీలక నేతల అభ్యర్థిత్వాలు ఖరారైనట్లయింది.
ఎంతో ఆలోచించి, అందరి యోగ్యతలను మదించిన తర్వాత ఉపాధ్యక్ష పదవికి వాన్స్ తగిన వ్యక్తి అని నిర్ణయించుకున్నానని డొనాల్డ్ ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్‌లో పోస్టు చేశారు. మెరైన్ విభాగంలో అమెరికాకు ఆయన సేవలందించారని తెలిపారు. ఒహాయో స్టేట్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడైన ఆయన యేల్ లా విశ్వవిద్యాలయం పట్టభద్రుడని పేర్కొన్నారు. సాంకేతికత, ఆర్థిక రంగాల్లో విజయవంతమైన వ్యాపారవేత్త అని రాసుకొచ్చారు. 2022లో మెుదటి సారిగా అమెరికా సెనేట్‌కు జేడీ వాన్స్ ఎన్నికయ్యారు. భారత సంతతి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉషా చిలుకూరిని వాన్స్ వివాహమాడారు.
వాన్స్, ట్రంప్ క్లోన్ : బైడెన్
జేడీ వాన్స్‌ను రిపబ్లిక్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా అనౌన్స్ చేసిన తర్వాత ఆయనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. వాన్స్‌ను ట్రంప్ క్లోన్‌గా అభివర్ణించారు. వారిద్దరి మధ్యలో తేడా ఏం లేదన్నారు. ప్రచారం నిమిత్తం నవాడాకు బయలుదేరుతుండగా, ఆండ్రూస్ ఏయిర్‌ఫోర్స్ బేస్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు.
ట్రంప్‌నకు భారీ ఊరట
మరోవైపు, రహస్య పత్రాలకు సంబంధించిన ఓ కేసులో డొనాల్డ్ ట్రంప్‌నకు భారీ ఊరట లభించింది. ఈ కేసును ఫ్లోరిడా న్యాయస్థానం కొట్టివేసింది. అభియోగాలు దాఖలు చేసిన ప్రత్యేక న్యాయవాదిని చట్టవిరుద్ధంగా నియమించారని ట్రంప్ తరఫు లాయర్ చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది. నేరాభియోగాల విచారణల నుంచి మాజీ అధ్యక్షులకూ మినహాయింపు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కొద్ది రోజులకే తాజా తీర్పు వెలువడింది.
ఇదీ కేసు
2021 జనవరిలో అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత ట్రంప్ ప్రభుత్వానికి చెందిన వందలాది కీలక పత్రాలను ఫ్లోరిడాలోని తన ఎస్టేట్‌కు తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. శ్వేతసౌధాన్ని ఖాళీ చేసేందుకు తక్కువ సమయం ఇవ్వడం వల్ల ఆ హడావుడిలో పత్రాలు వచ్చి ఉంటాయని ట్రంప్ కార్యాలయం అప్పట్లో ప్రకటించింది. ఆ పత్రాలను తిరిగి తీసుకునేందుకు నేషనల్ ఆర్కైవ్స్ అండ్ రికార్డ్ అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నించగా, వాటిని ట్రంప్ అడ్డుకున్నారు. 2022 జనవరిలో FBI అధికారులు ట్రంప్ ఎస్టేట్‌లో సోదాలు చేపట్టగా 15 బాక్సుల్లో 184 పత్రాలు లభ్యమయ్యాయి. ఆ తర్వాత ఆగస్టులోనూ అత్యంత నాటకీయ పరిణామాల మధ్య FBI మరోసారి ఆ ఎస్టేట్‌పై దాడి చేసి 20 పెట్టెల నిండా పత్రాలను సీజ్ చేసింది.
ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్ షాక్ - మాజీ ప్రధాని పార్టీపై పాక్ ప్రభుత్వం నిషేధం!
నేపాల్ కొత్త ప్రధానిగా కేపీ శర్మ ఓలీ ప్రమాణం- మోదీ శుభాకాంక్షలు