Trump agrees to debate with Kamala Harris : అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థులు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 10న అధ్యక్ష అభ్యర్థులు కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య జరగబోయే డిబేట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ డిబేట్ అంశమై డొనాల్ట్ ట్రంప్ స్పందించారు. డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌తో డిబేట్ కోసం ఒప్పదం కుదుర్చుకున్నట్లు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో పోస్టు పెట్టారు. అలాగే ఈ భేటీకి సంబంధించిన నిర్దిష్ట షరతులు, నియమాలను ట్రంప్ తెలిపారు.
"కామ్రేడ్ కమలా హారిస్‌తో సెప్టెంబర్ 10న ఫిలడెల్ఫియాలో జరిగే డిబేట్ కోసం నేను రాడికల్ లెఫ్ట్ డెమొక్రాట్లతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాను. ఏబీసీ ఫేక్ న్యూస్‌లో ఈ డిబేట్ ప్రసారమవుతుంది. కాకపోతే అది అత్యంత అన్యాయమైన వార్తా సంస్థ" అని తన సోషల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో పోస్టు పెట్టారు. ఈ డిబేట్ విషయంలో ట్రంప్‌నకు అనేక అభ్యంతరాలు ఉన్నాయని, కనుక దానిని రద్దు చేసుకునే అవకాశముందని ఇంతకు ముందు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఆయన కమలా హారిస్‌తో చర్చకు అంగీకరించడం గమనార్హం.
నియమాలు ఇవే!
జూన్ 27న సీఎన్ఎన్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో జరిగిన డిబేట్లో పాటించిన నియమాలను అనుసరించడానికి తాను, కమలా హారిస్ ఒప్పందానికి వచ్చినట్లు రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్ట్ ట్రంప్ తెలిపారు. ఇందులో ప్రత్యక్ష ప్రేక్షకులు ఉండరని వెల్లడించారు. అభ్యర్థులు మాట్లాడనప్పుడు మైక్రోఫోన్లు మ్యూట్ చేసి ఉంటాయని తెలిపారు.
"చివరిసారిగా సీఎన్ఎన్ డిబేట్లో అనుసరించిన నిబంధనలే ఇందులోనూ ఉంటాయి. అయితే ఈ నిబంధనలు అధ్యక్షుడు జో బైడెన్‌కు మినహా అందరికీ బాగా అనిపించాయి. డిబేట్లో అభ్యర్థులు నిలబడి మాట్లాడుతారు. అభ్యర్థులు నోట్స్ లేదా షీట్లు తీసుకురావటం ఉండదు. ఇక ఈ డిబేట్ న్యాయమైన చర్చగా ఉంటుందని, ఏ పక్షానికీ ముందుగానే ప్రశ్నలు ఇవ్వటం జరగదని ఏసీబీ మాకు హామీ ఇచ్చింది. సెప్టెంబర్ 4న ఫాక్స్ న్యూస్ డిబేట్‌కు కమల హారిస్ అంగీకరించలేదు. ఆమె మనసు మార్చుకుంటే అదే రోజు డిబేట్ చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను" అని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.