UK Graduate Visa : విదేశీ విద్యార్థులకు ఇచ్చే రెండేళ్ల గ్రాడ్యుయేట్ వీసాలను అలాగే కొనసాగించాలని బ్రిటన్ ప్రభుత్వం నియమించిన రివ్యూ కమిటీ సూచించింది. భారత్ సహా పలు దేశాల విద్యార్థులు చెల్లించే రుసుముల వల్ల బ్రిటన్ యూనివర్సిటీలకు బాగా ఆర్థిక వనరులు సమకూరుతున్నాయని పేర్కొంది. దీని వల్ల ఆయా విద్యాసంస్థల లోటు బడ్జెట్ సమస్య తీరుతోందని మైగ్రోషన్ అడ్వైజరీ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. అంతేకాదు దీని వల్ల పరిశోధనల విస్తృతి కూడా పెరుగుతుందని అభిప్రాయపడింది.
బ్రిటన్ యూనివర్సిటీల్లో చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు జారీ చేసే గ్రాడ్యుయేట్ వీసాల వల్ల కలిగే లాభనష్టాల గురించి అధ్యయనం చేయడానికి, ప్రభుత్వం ఈ రివ్యూ కమిటీని నియమించింది. బ్రిటన్ అంతర్గత వ్యవహార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీ తాజాగా కీలక సూచనలు చేసింది. ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు, వారి నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడం కోసం రెండేళ్ల వ్యవధితో మంజూరు చేసే వీసాలను అలాగే కొనసాగించాలని ఎంసీఏ సూచించింది.
భారతీయ విద్యార్థుల పరిస్థితి ఏమిటి?
గ్రాడ్యుయేట్ వీసా విభాగంలో భారతీయ విద్యార్థులు అత్యధికంగా ఉన్నారు. మొత్తం వీసాల్లో 89,200 (40%) వీసాలను ఇండియన్ విద్యార్థులు 2024-23 మధ్యకాలంలో పొందారని రివ్యూ కమిటీ గుర్తించింది. ఇంతగా భారతీయ విద్యార్థులు బ్రిటన్ విశ్వవిద్యాలయాలను ఎంచుకోవడానికి ఈ గ్రాడ్యుయేట్ వీసా విధానమే ప్రధాన కారణమని అభిప్రాయపడింది.
విద్య నాణ్యత
ప్రస్తుత గ్రాడ్యుయేట్ వీసా విధానాన్ని కొనసాగిస్తూనే, బ్రిటన్ విద్యావిధానం, విద్య నాణ్యత దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఎంఏసీ ఛైర్ ప్రొఫెసర్ బ్రియాన్ బెల్ అభిప్రాయపడ్డారు. ఉన్నత విద్య అనంతరం ఇక్కడే జాబ్ చేసుకునే అవకాశాలపై ఆంక్షలు విధించినట్లైతే, బ్రిటన్‌కు వచ్చే భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని బ్రియాన్ బెల్ హెచ్చరించారు.
ఉపాధి సంగతేంటి?
చదువుల పేరిట బ్రిటన్‌కు వచ్చి తక్కువ జీతంతో ఉద్యోగాలకు సిద్ధపడే విద్యార్థులు పెరుగుతున్నారు. ఇది స్థానిక యువత ఉద్యోగ అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి విద్యాలయాల్లో చేరే విదేశీ విద్యార్థులతో ఈ సమస్య ఎక్కువగా ఎదురవుతోందని బ్రియాన్ బెల్ పేర్కొన్నారు. అందువల్ల నైపుణ్య సాధన, ఉద్యోగాల మధ్య స్పష్టమైన విభజన ఉండాలని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మోసపు వాగ్దానాలతో, అడ్డదారుల్లో బ్రిటన్ యూనివర్సిటీల్లో విదేశీ విద్యార్థులను చేర్చుకోకుండా నిరోధించేందుకు గాను, ఇంటర్నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెంట్స్ నమోదును తప్పనిసరి చేయాలని ఈ రివ్యూ కమిటీ సిఫార్సు చేసింది.
POKలో ఎట్టకేలకు ఆగిన హింస- ఆందోళనకారుల డిమాండ్లకు పాక్ సర్కార్ ఓకే - Pok Protests