UK Election Results 2024 : బ్రిటన్‌లో లేబర్ పార్టీ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించింది. దీంతో 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇంత కాలం బ్రిటన్ పరిపాలించిన కన్జర్వేటివ్ పార్టీకి ఈసారి ఓటమి తప్పలేదు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో లేబర్ పార్టీకి సంపూర్ణ ఆధిక్యం దక్కింది. మొత్తం 650 స్థానాల్లో లేబర్ పార్టీ 400 మార్కు దిశగా పయనిస్తోంది. భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ 80 స్థానాలు దాటింది.
కౌటింగ్ ప్రారంభమై కొద్ది గంటలకే(భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలు) లేబర్ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌ను అధిగమించింది. ఈ ఎన్నికల్లో ఘన విజయంతో లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ తన మద్దతుదారులతో మాట్లాడారు. '14 ఏళ్ల తర్వాత ఈ దేశ భవిష్యత్తు మళ్లీ కనిపిస్తోంది. పార్టీపై నమ్మకం ఉంచి గెలిపించినందుకు మీ అందరికి కృతజ్ఞతలు. మన దేశంలో మార్పును తీసుకొచ్చారు. ప్రజల తీర్పు మనపై పెద్ద బాధ్యతను ఉంచింది. కొత్త అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. దేశ పునరుద్ధరణ దిశగా పని మొదలుపెడదాం' అని కీర్ స్టార్మర్ అన్నారు.
'ఓటమికి బాధ్యత వహిస్తున్నా'
ఇక ఫలితాలు వెలువడుతుండగానే బ్రిటిన్ ప్రధాని రిషి సునాక్ తన పార్టీ ఓటమి అంగీరించారు. 'ఈ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీని విజయం వరిచింది. ఆ పార్టీ నేత కీర్ స్టార్మర్‌కు అభినందనలు తెలియజేస్తున్నాను. అధికారం శాంతియుతంగా చేతులు మారుతుంది. అది మన దేశ భవిష్యత్తు, స్థిరత్వంపై అందరికీ విశ్వాసం కలిగిస్తుంది. మీరు(పార్టీ మద్దతుదారులను ఉద్దేశించి) నన్ను క్షమించండి. ఓటమికి బాధ్యత వహిస్తున్నా' అని రిషి సునాక్ తన సొంత నియోజకవర్గంలో ప్రకటించారు. రెండేళ్ల క్రితమే బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రిషి సునాక్, తాను పోటీ చేసిన రిచ్‌మండ్ అండ్ నార్తర్న్ అలర్టన్ స్థానంలో గెలుపొందారు.
ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ వ్యాప్తంగా 650 స్థానాల్లో గురువారం ఎన్నికలు జరిగాయి. బ్రిటన్ కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై రాత్రి 10 గంటలకు వరకు కొనసాగింది. దాదాపు 4.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా ఈ సారి 2019తో పోలిస్తే తక్కువ పోలింగ్ నమోదైనట్లు అధికారులు అంచనా వేశారు. గతంలో 67 శాతం పోలింగ్ నమోదైంది. ఓటింగ్ పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. కాసేపటికే కౌంటింగ్ ప్రారంభమైంది.
6రోజులు సోషల్ మీడియా మొత్తం బ్యాన్- ప్రభుత్వం కీలక నిర్ణయం- ఎందుకంటే?
'నేనే డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిని- ఎన్నికల్లో ట్రంప్‌ను ఓడిస్తా'- జో బైడెన్ స్పష్టం