Turkey Fire Accident Today : తుర్కియే ప్రధాన నగరం ఇస్తాంబుల్‌లో మంగళవారం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 29 మృతి చెందారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. నైట్‌క్లబ్‌లో రెనోవేషన్ పనులు జరుగుతున్న సమయంలో ప్రమాదం సంభవించిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో గాయపడిన ఎనిమిది మందిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని, బాధితులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
మూసి ఉన్న నైట్ క్లబ్‌లో ప్రమాదం
ఈ ఘటనకు ముందు పునరుద్ధరణ పనుల కోసం నైట్‌క్లబ్‌ను మూసివేశారు. నైట్‌క్లబ్ 16 అంతస్తుల ఎత్తైన భవనంలో మొదటి అంతస్తులో ఉంది. బోస్ఫరస్ నది వల్ల బెసిక్టాస్ జిల్లా రెండు ప్రాంతాలుగా వేరైంది. ఇప్పుడు యూరోపియన్ వైపున ఉన్న బెసిక్టాస్ ప్రాంతంలో నైట్ క్లబ్ ఉన్న బిల్డింగ్ ఉంది. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నామని, బాధితులను రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని గవర్నర్ దావత్ గుల్ విలేకరులకు తెలిపారు.
12ఏళ్ల విద్యార్థి కాల్పులు
ఫిన్‌లాండ్ రాజధాని హెల్సింకీలో మంగళవారం హృదయ విదారక ఘటన జరిగింది. వాన్టా నగరంలోని వియెర్టోలా పాఠశాలలో 12 ఏళ్ల విద్యార్థి లైసెన్స్‌డ్ తుపాకీతో కాల్పులు జరిపాడు. కాల్పుల్లో ఓ విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వియెర్టోలా పాఠశాలలో దాదాపు 800 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కాల్పులపై వేగంగా స్పందించిన పోలీసులు, నిందితుడిని హెల్సింకిలో అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు ఉపయోగించిన తుపాకీ నిందితుడి బంధువుదని, లీగల్లీ రిజిస్టర్ అయిందని పేర్కొన్నారు. కాగా, కాల్పులకు గల కారణం మాత్రం ఇంకా తెలియరాలేదు.
నిందితుడికి 12 ఏళ్లు
ఫిన్లాండ్‌లో క్రిమినల్ లయబిలిటీకి కనీస వయస్సు 15 సంవత్సరాలు కావడం వల్ల నిందితుడిని అధికారికంగా అరెస్టు చేయడం సాధ్యం కాదు. ఈ కేసును ఫిన్‌లాండ్ ఛైల్డ్ వెలిఫేర్ అథారిటీస్ విచారిస్తుంది. బాధిత కుటుంబాలకు ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, ప్రధాని పెట్టేరి ఓర్పో సంతాపం ప్రకటించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ప్రధాని తెలిపారు.