Trump Wins South Carolina Primary : అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ మరో ప్రైమరీలో విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన తన ప్రత్యర్థి నిక్కీ హేలీనీ ఆమె సొంత రాష్ట్రం సౌత్ కరోలినాలోనే సునాయాసంగా ఓడించారు. ఇప్పటికే అయోవా, న్యూ హాంప్‌షైర్, నెవాడా రాష్ట్రాల ప్రైమరీల్లో ట్రంప్ గెలుపొందారు.
అయితే సౌత్ కరోలినాకు నిక్కీ హేలీ రెండు పర్యాయాలు గవర్నర్‌గా పనిచేశారు. ఈ రాష్ట్రం హేలీ కంచుకోటగా విశ్లేషకులు చెబుతారు. ఇక్కడ కూడా ట్రంప్ ఘన విజయం సాధించడం వల్ల, రిపబ్లిక్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో పోటీ చేసేందుకు అభ్యర్థిత్వం ట్రంప్‌నకే దాదాపు ఖాయమైపోయినట్లు ప్రచారం సాగుతోంది.
'నన్ను పోటీ నుంచి తప్పుకోమన్నారు'
తనను పోటీ నుంచి తప్పుకోవాలని ట్రంప్ వర్గం డిమాండ్ చేసిందని నిక్కీ హేలీ ఆరోపించారు. ఈ మేరకు శనివారం పోలీంగ్ తర్వాత సౌత్ కరోలినా రాజధాని కొలంబియాలో ఆమె మాట్లాడారు. 'ట్రంప్ వర్గం ఎంత ఒత్తిడి చేసినా, నేను పోటీ నుంచి తప్పుకోలేదు. మార్చి 5న (సూపర్ ట్యూస్డే) జరిగే పలు రాష్ట్రాల ప్రైమరీ ఎన్నికల్లో కూడా పోటీలో ఉంటాను' అని నిక్కీ హేలీ స్పష్టం చేశారు.
అయితే ప్రస్తుతం 5 ప్రైమరీల్లో విజయం సాధించిన ట్రంప్ అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం రేసులో ముందుంజలో ఉన్నారు. ఇక డెమోక్రాటిక్ పార్టీ ప్రైమరీల్లో అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ ముందున్నారు. ప్రైమరీలు ముగిసి పార్టీల తరఫున అభ్యర్థులు ఖరారైన తర్వాత, 2024 నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.
ట్రంప్‌నకు రూ.3000 కోట్ల భారీ ఫైన్
గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి డోనల్డ్ ట్రంప్‌ను సమస్యలు చుట్టుముట్టాయి. ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. అందులో ఒకటైన సివిల్ ఫ్రాడ్ కేసులో ఇటీవల న్యూయార్క్ కోర్టు ఆయనకు 355 మిలియన్ డాలర్ల ( భారత కరెన్సీలో రూ. 2,946 కోట్లు ) భారీ జరిమానా విధించింది. అలానే న్యూయార్క్‌లోని కార్పొరేషన్లో డైరెక్టర్‌గా లేదా అధికారిగా పనిచేయకుండా మూడేళ్ల పాటు ట్రంప్‌పై నిషేధం విధించింది. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఎట్టకేలకు తల్లి వద్దకు నావల్నీ మృతదేహం- చనిపోయాక కూడా చిత్రహింసే!
గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్- శరణార్థి శిబిరాలే టార్గెట్- 100మంది మృతి