Trump on UFO footage : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే దేశంలోని అత్యంత రహస్య విషయాలను బయటపెడతానని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. శ్వేతసౌధంలో అడుగుపెడితే యూఎఫ్‌వో (గుర్తుతెలియని ఎగిరే వస్తువు) దృశ్యాలు, మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ హత్యకు సంబంధించిన పత్రాలు, ఎప్‌స్టైన్ ఫైల్స్ వంటి రహస్యాలను బహిర్గతం చేస్తానని హామీ ఇచ్చారు. ఓ పాడ్‌కాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
కొంతమందిని కాపాడేందుకే రహస్యంగా
ఇక మాజీ అధ్యక్షడు కెన్నడీ విషయంలో తనను డెమోక్రాట్లే ముందుకు నెడుతున్నారని ట్రంప్ పేర్కొన్నారు. ఇప్పటికే చాలా పత్రాలను విడుదల చేసినట్లు తెలిపారు. చాలా మంది తన వద్దకు వచ్చి అలా చేయవద్దని కోరుతున్నారు కానీ, వాటిని ముందే విడుదల చేస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్‌స్టైన్ కేసు ఫైల్స్‌పై ట్రంప్ స్పందించారు. 'నేను నేరం చేయలేదు. ఆ కుంభకోణంలో నా భాగస్వామ్యం లేదు. అదృష్టవశాత్తూ జెఫ్రీ విలాసవంతమైన ద్వీపానికి వెళ్లలేదు. చాలా మంది అక్కడికి వెళ్లారు. కొంతమందిని కాపాడేందుకు ఆ ద్వీపాన్ని సందర్శించిన వారి జాబితాను రహస్యంగా ఉంచుతున్నారు' అని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.
అధ్యక్ష ఎన్నిక కోసం ఆగస్టులో 130 డాలర్ల విరాళాలు సేకరించినట్లు ట్రంప్ ఎన్నికల ప్రచార కమిటీ వెల్లడించింది. ఈ నిధులు గత జూలై నెలతో పోలిస్తే తక్కువే అని పేర్కొంది. మరోవైపు ట్రంప్ కొత్త పుస్తకం 'సేవ్ అమెరికా' విడుదలైన కొద్ది గంటల్లోనే అమెజాన్‌లో బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. రూ.7,728 (92.06 డాలర్లు) మేర భారీధర ఉన్నప్పటికీ, అమెజాన్‌లో 'ప్రెసిడెంట్స్ అండ్ హెడ్స్ ఆఫ్ ది స్టేట్ బయోగ్రఫీస్' జాబితాలో తొలిస్థానంలో నిలిచింది. మొత్తంగా 13వ స్థానంలో ఉంది.
హారిస్‌కు మద్దతుగా భారత సంతతి అమెరికన్లు
అమెరికాలోని భారత సంతతి అమెరికన్లలో పలువురు ప్రముఖులతో కూడిన ఓ బృందం డెమోక్రాట్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతిస్తూ ప్రచారం మొదలు పెట్టింది. అధ్యక్ష ఎన్నికల్లో హారిస్‌ను గెలిపించడం ద్వారా చరిత్ర సృష్టించడమే లక్ష్యంగా 'ఇండియన్ అమెరికన్స్ ఫర్ హారిస్' పేరిట మంగళవారం నుంచి ఈ ప్రచారాన్ని ప్రారంభిచారు.
కమలా హారిస్‌తో డిబేట్‌కు ట్రంప్ రె'ఢీ'- కానీ షరతులు వర్తిస్తాయి! - trump agrees to debate harris