Trump Biden Debate : అమెరికా చరిత్రలో అత్యంత కీలకమైన అధ్యక్ష చర్చకు రంగం సిద్ధమైంది. నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్న డెమోక్రటిక్ అభ్యర్థి, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్షంగా తలపడనున్నారు. జూన్ 27న మొదటిసారి వారి మధ్య చర్చ జరగనుంది. జార్జియాలోని అట్లాంటాలో 90 నిమిషాల పాటు జరగనున్న ఈ డిబేట్‌లో పలు కీలక అంశాలపై తమ వైఖరిని వీరిద్దరూ స్పష్టం చేయనున్నారు. స్వతంత్ర అధ్యక్ష అభ్యర్థి రాబర్ట్ ఎఫ్ కెన్నడీ ఈ డిబేట్‌కు అర్హత సాధించలేదు. ఈ క్రమంలో వారు పలు కఠినమైన ప్రశ్నలు ఎదుర్కోనున్నారు.
81 ఏళ్ల బైడెన్, 78 ఏళ్ల ట్రంప్
ట్రంప్‌పై దూకుడైన వైఖరి ప్రదర్శించాలని బైడెన్ కోరుకుంటున్నారు. స్థిరమైన నాయకుడు కావాలో లేదా దోషిగా తేలిన వారు కావాలో తేల్చుకోమని బైడెన్ ప్రజలను కోరనున్నారు. ట్రంప్ ప్రజాస్వామ్యానికే ఓ ముప్పుగా బైడెన్ అభివర్ణించనున్నారు. అయితే తన వయసు 81 ఏళ్ల దాటడం, ఇంకో నాలుగేళ్లు అధ్యక్ష పదవి చేపట్టేందుకు మానసికంగా ఫిట్‌గా లేకపోవడం బైడెన్‌కు ప్రతికూలంగా మారింది. ఈ ఎన్నికల్లో 81 ఏళ్ల బైడెన్, 78 ఏళ్ల ట్రంప్ వయసు కూడా ప్రధానాంశంగా ఉంది.
కీలక సంఘటనలను కూడా!
ముఖ్యంగా బైడెన్ తన జీవితంలో జరిగిన కీలక సంఘటనలను కూడా గుర్తుంచుకోలేకపోయారని కొద్దినెలల క్రితం ఒక నివేదిక వెల్లడించింది. ఉపాధ్యక్షుడిగా పనిచేసిన కాలం కూడా బైడెన్‌కు గుర్తులేదని తెలిపింది. ఇటీవల ఇటలీలో జరిగిన జీ7 సదస్సు సహా పలు సందర్భాల్లో బైడెన్ గందరగోళానికి గురైన సంఘటనలు జరిగాయి. దాంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలో ఆయన ట్రంప్ దూకుడు ముందు ఎలా నిలుస్తారా? అని అంతా ఎదురు చూస్తున్నారు.
మానసిక సామర్థ్యానికి ఇదొక పరీక్ష!
మరోవైపు బైడెన్ హయాంలో ధరలు, వలసలు రికార్డుస్థాయిలో పెరగటాన్ని ట్రంప్ అస్త్రాలుగా మలచుకోనున్నారు. ఈ అంశాలపై బైడెన్‌ను ఇరుకున పెట్టాలని ట్రంప్ భావిస్తున్నారు. అబార్షన్ వంటి అంశాలపై మాజీ అధ్యక్షుడి అతివాద వైఖరిని బైడెన్ ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ వృద్ధ నేతల మానసిక సామర్థ్యానికి ఇదొక పరీక్ష అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ హోరాహోరీగా ఉంది. ఇప్పటివరకు వచ్చిన ఒపీనియన్ పోల్స్ ప్రకారం ఓటర్లు ఈ ఇద్దరు అధ్యక్ష అభ్యర్థులోఎవరివైపు స్పష్టమైన మొగ్గు చూపించడం లేదు. కానీ ప్రస్తుత చర్చతో వారికొక స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.