South Africa Bus Accident : దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈస్టర్ పండుగకు భక్తులను తీసుకెళుతున్న బస్సు వంతెనపై నుంచి అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 45 మంది మృతిచెందగా 8 ఏళ్ల బాలిక మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
దక్షిణాఫ్రికాలోని మోరియా పట్టణంలో ఈస్టర్ పండుగ ఘనంగా జరుగుతుంది. ఇక్కడ జరిగే వేడుకలకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరవుతారు. ఈ నేపథ్యంలో మొత్తం 46 మందితో కూడిన బస్సు పొరుగు దేశమైన బోట్స్‌వానా నుంచి మోరియాకు బయలుదేరింది. దక్షిణాఫ్రికాలోని లిపోపో రాష్ట్రంలో కొండపై నిర్మించిన వంతెన మూలమలుపు వద్ద అదుపుతప్పడం వల్ల బస్సు 164 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. అనంతరం బస్సు నుంచి మంటల చెలరేగాయి.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టినట్లు స్థానిక రవాణా శాఖ పేర్కొంది. ప్రమాదంలో బస్సు డ్రైవర్ సైతం చనిపోగా, ప్రాణాలతో బతికున్న బాలికను సమీప ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు చెప్పారు. తీవ్రంగా గాయపడిన ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, కొన్ని మృతదేహాలు గుర్తించలేనంతగా మంటల్లో కాలిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ఈ దుర్ఘటనపై అక్కడి రవాణా మంత్రి సిండిసివే చికుంగా స్పందించారు. మృతుల కుటుంబాల ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని మంత్రి సిండిసివే సందర్శించనున్నారు.
మోరియో నగరంలో జియోనిస్ట్ క్రిస్టియన్ చర్చ్ ప్రధాన కార్యాలయం ఉంది. ఇక్కడ ఈస్టర్ వేడుకల ఘనంగా జరుగుతాయి. దీంతో దక్షిణాఫ్రికానుంచే కాకుండా చుట్టుపక్కల దేశాల నుంచి వేలాది మంది ప్రజలు ఇక్కడికి వస్తారు. కొవిడ్ తర్వాత మోరియా ఈస్టర్ పండగ ఈ స్థాయిలో జరగడం ఇదే మొదటిసారి. అయితే ఈస్టర్ సీజన్లో తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తుంటాయి. గతేడాది ఈస్టర్ వారాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 200మందికి పైగా మృతిచెందారు.