Russia President Vladimir Putin : రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ఎన్నికయ్యారు. 2012 నుంచి రష్యా అధ్యక్షుడిగా ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న పుతిన్ తాజా ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 87 శాతం ఓట్లతో(దాదాపు 76 మిలియన్ల ఓట్లు) ఐదోసారి పుతిన్ విజయం సాధించారని రష్యా ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో మరో ఆరేళ్లు రష్యా అధినేతగా పుతిన్ కొనసాగనున్నారు.
పుతిన్‌కు దరిదాపుల్లో లేని ప్రత్యర్థులు
రష్యాలో మూడు రోజుల పాటు జరిగిన ఈ అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 74.22 శాతం ఓటింగ్ రికార్డ్ అయింది. ఇందులో పుతిన్‌కు అత్యధికంగా 87 శాతం ఓట్లు లభించాయని ఎన్నికల సంఘం తెలిపింది. అయితే పుతిన్ ఓటింగ్ శాతంను పరిశీలిస్తే మరే ప్రతిపక్ష నేత కూడా దరిదాపుల్లో లేనట్లు స్పష్టంగా కనిపిస్తుంది. పుతిన్‌కు పోటీగా బరిలో ఉన్న ప్రత్యర్థులకు పడ్డ ఓట్ల శాతం వివరాలు ఇలా ఉన్నాయి.
- న్యూ పీపుల్ పార్టీ వ్లాదిస్లవ్ డవాంకోవ్‌కు- 4.8శాతం ఓట్లు
- కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన నికోలోయ్ ఖరితోనోవ్‌కు- 4.1శాతం ఓట్లు
- లిబరల్ డెమొక్రటిక్ పార్టీకి చెందిన లియోనిడ్ స్లట్‌స్కీకి- 3.15 శాతం ఓట్లు
'అడుగు దూరంలో మూడో ప్రపంచ యుద్ధం'
మరోవైపు పూర్తిస్థాయి మూడో ప్రపంచ యుద్ధానికి ఈ విశ్వం కేవలం అడుగు దూరంలోనే ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. రష్యా అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి మధ్య ఘర్షణ తలెత్తితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని పుతిన్ అన్నారు. అయితే దీన్ని ఎవరూ కోరుకోవడం లేదని తెలిపారు.
నావల్నీ మృతిపై తొలిసారి మాట్లాడిన పుతిన్
దివంగత విపక్ష నేత నావల్నీ మృతిపై తొలిసారి మాట్లాడారు అధ్యక్షుడు పుతిన్. 'నావల్నీ మరణం ఒక విషాదకరమై ఘటన. జైలులో ఉన్న వ్యక్తులు మరణించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే నావల్నీ చనిపోవడానికి కొద్ది రోజుల ముందే అతడిని విడుదల చేసే అంశంపై చర్చించాం. ఆయన తిరిగి రష్యాలో అడుగు పెట్టకూడదన్న షరతుతో విడుదల చేయాలని అనుకున్నాం. కానీ, దురదృష్టవశాత్తు జైలులో ఉన్నప్పుడే నావల్నీ మరణించాడు' అని పుతిన్ అన్నారు.
'అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోకపోతే అమెరికాలో రక్తపాతమే'- డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
'ఆ కండీషన్‌తో నావల్నీని రిలీజ్ చేద్దామనుకున్నాం'- మరోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ఫిక్స్!