Pneumonia Outbreak in Pakistan : పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో గత మూడు వారాల్లో న్యుమోనియా కారణంగా 200 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అతిశీతల వాతావరణం కారణంగా ఈ మరణాలు సంభవిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రాణాలు కోల్పోతున్న వారిలో ఎక్కువ మంది పోషకాహార లోపం, న్యుమోనియా వ్యాక్సిన్ తీసుకోని వారని స్థానిక ప్రభుత్వం తెలిపింది.
ఐదేళ్ల లోపు పిల్లలే!
Pneumonia Statistics In Pakistan : పంజాబ్ ప్రావిన్సులో జనవరి 1 నుంచి 10వేలకు పైగా న్యుమోనియా కేసులు నమోదయ్యాయిని ప్రభుత్వం తెలిపింది. 220 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని ప్రకటించింది. వీరంతా ఐదేళ్ల లోపు పిల్లలేనని చెప్పింది. లాహోర్‌లోనే 47 మంది చనిపోయారని పేర్కొంది. పంజాబ్ ప్రావిన్సులో గతేడాది 990 మంది న్యుమోనియాతో చనిపోయినట్లు వెల్లడించింది.
కొవిడ్ వైరస్ లానే వ్యాప్తి!
అయితే న్యుమోనియాకు బ్యాక్టీరియా, వైరస్ కారణమని స్థానిక వైద్యాధికారులు తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి రక్షణ ఉంటుందని వెల్లడించారు. అయినప్పటికీ కొన్నిసార్లు వైరల్ న్యుమోనియా సోకే ప్రమాదం కూడా ఉందని చెప్పారు. ఇప్పటికే పాఠశాలల్లో ఉదయం అసెంబ్లీపై నిషేధం విధించామని పేర్కొన్నారు. కొవిడ్ వైరస్ లానే న్యూమోనియా వేగంగా వ్యాపిస్తుందని వెల్లడించారు.
ఆత్మాహుతి దాడిలో 23మంది మృతి
ఇటీవలే, పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఘటనలో 23 మంది సైనికులు మరణించారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్థాన్ తాలిబన్ సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న తెహ్రీక్-ఎ-జిహాద్-పాకిస్థాన్ అనే ఉగ్రవాద సంస్థ దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన చేసింది. పాకిస్థాన్- అఫ్గానిస్థాన్ సరిహద్దులోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది. డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని దారాబన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న సైనిక స్థావరంపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేశారు. పేలుడు పదార్థాలు నింపిన ట్రక్కును ఆరుగురు ఉగ్రవాదులు సైనిక స్థావరంలోని భవనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో 23 మంది సైనికులు చనిపోయారని ఆర్మీ ప్రకటించింది. ఈ పూర్తి వార్త కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి