PM Modi Putin Bilateral Meeting BRICS : రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో శాంతి, స్థిరత్వం తిరిగి నెలకొనడానికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. తామంతా చేసే ప్రయత్నాలు మానవత్వానికి ప్రధాన్యమిస్తాయని చెప్పారు. రానున్న కాలంలో ఈ సమస్య పరిష్కారానికి సాధ్యమైన సహకారం అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని తాము నమ్ముతున్నట్లు మోదీ పునరుద్ఘాటించారు. రష్యా, ఉక్రెయిన్ సమస్యపై తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. జులైలో జరిగిన భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశం ప్రతి రంగంలో సహకారాన్ని బలోపేతం చేసిందని వెల్లడించారు. మూడు నెలల్లో రష్యాలో తాను చేస్తున్న ఈ రెండో పర్యటన, భారత్-రష్యా మధ్య లోతైన సమన్వయాన్ని, స్నేహాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు.
16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యా వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా బ్రిక్స్ సదస్సుకు విజయవంతంగా నిర్వహించినందుకు రష్యాను అభినందించారు. చాలా దేశాలు ఈ గ్రూప్‌లో చేరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
#WATCH | Kazan: During his meeting with Russian President Vladimir Putin, PM Narendra Modi says, " i express my heartfelt gratitude for your friendship, warm welcome and hospitality. it is a matter of great pleasure for me to have the opportunity to visit a beautiful city like… pic.twitter.com/hLMRgjUaHb
— ANI (@ANI) October 22, 2024
దేశాధినేతల చిరునవ్వులు
ఈ సందర్భంగా వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడారు. "జులైలో మనం కలిసిన విషయం నాకు గుర్తుంది. పలు సమస్యలపై మంచి నిర్ణయాలు తీసుకున్నాం. నా ఆహ్వానం మేరకు కజాన్‌కు మీరు రావడం గొప్ప విషయం. ఈ రోజు మనం బ్రిక్స్ ఓపెనింగ్ సెరెమొనీలో పాల్గొంటాం. అనంతరం డిన్నర్ ఉంటుంది. అనంతరం బ్రిక్స్‌లోని ఇతర సభ్యులతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటాం" అని పుతిన్ చెప్పారు. (నవ్వుతూ) ఇక ఇరు దేశాల మధ్య ఉన్న సబంధాలకు అనువాదం అవసరం లేదని తనకు అనిపిస్తుందని పుతిన్ అన్నారు. అనంతరం ప్రధాని మోదీ చిరునవ్వులు చిందించారు.
#WATCH | Kazan, Russia: " we have such a relationship that i felt that you do not need any translation" said russian president vladimir putin at the bilateral meeting with prime minister narendra modi
— ANI (@ANI) October 22, 2024
(source: host broadcaster via reuters) pic.twitter.com/Cvq7pMFeGj
బ్రిక్స్ కూటమి 16వ శిఖరాగ్ర సదస్సు- "ప్రపంచాభివృద్ధి, భద్రత కోసం బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయడం" అనే ప్రధాన నినాదంతో జరుగుతోంది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ఇతర దేశాల నేతలు పాల్గొంటారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాతో బ్రిక్స్ కూటమి ఏర్పాటైంది. అనంతరం దాన్ని మరింత విస్తరించి ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈలకూ సభ్యత్వం ఇచ్చారు. కూటమి విస్తరణ తర్వాత ఇదే తొలి శిఖరాగ్ర సదస్సు. ప్రధాని మోదీ రష్యా పర్యటన చేపట్టడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి.