PM Modi Poland Visit 2024 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం విదేశీ పర్యటనకు బయల్దేరారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఆయన పోలెండ్, ఉక్రెయిన్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు ముందు ప్రధాని మోదీ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఉక్రెయిన్‌లో శాంతి, స్థిరత్వం త్వరగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
"మధ్య ఐరోపాలో భారత్‌కు పోలెండ్ కీలక ఆర్థిక భాగస్వామిగా ఉంది. ఇరుదేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పోలెండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడా, ప్రధాని డొనాల్డ్ టస్క్‌తో నా భేటీ కోసం ఎదురుచూస్తున్నా. అక్కడి భారతీయులతోనూ ముచ్చటస్తా. ఆ పర్యటనను ముగించుకొని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదమిర్ జెలెన్‌స్కీ ఆహ్వానం మేరకు కీవ్ వెళ్లనున్నా. ఆ దేశంలో భారత ప్రధాని చేపట్టబోయే తొలి పర్యటన ఇదే కానుంది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడమే ప్రధానాంశంగా ఈ పర్యటన సాగనుంది. గత రెండేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారంపై జెలెన్‌స్కీతో నా ఆలోచనలు పంచుకొనే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా. అక్కడ శాంతి, స్థిరత్వం త్వరగా తిరిగిరావాలని ఆకాంక్షిస్తున్నా" అని ప్రధాని మోదీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
70 ఏళ్ల బంధం
తన విదేశీ పర్యటన రెండు దేశాలతో విస్తృతమైన సంబంధాలకు ఉపయోగపడుతుందని, రాబోయే సంవత్సరాల్లో మరింత శక్తివంతమైన బంధాన్ని నెలకొల్పడానికి సహాయపడుతుందని తాను విశ్వసిస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్, పోలెండ్ మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ ఈ పర్యటన చేపట్టారు. 45 ఏళ్ల తర్వాత ఆ దేశానికి వెళ్తున్న తొలి భారత ప్రధాని ఈయనే కావడం విశేషం. చివరిసారిగా 1979లో నాటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్ పోలెండ్‌ను సందర్శించారు. ఇక, గత రెండేళ్లుగా ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో మోదీ కీవ్ పర్యటనకు చాలా ప్రాధాన్యం సంతరించుకుంది.
మోదీ బుధవారం, గురువారం పోలండ్‌లో పర్యటిస్తారు. అక్కడి నుంచి ఆగస్టు 23న ప్రత్యేక రైలులో సుమారు 10 గంటలు ప్రయాణించి కీవ్ చేరుకుంటారు. జెలెన్‌స్కీతో సమావేశమై తిరిగి మళ్లీ అదే రైలు మార్గంలో పోలెండ్ చేరుకుంటారు. అనంతరం పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగొస్తారు.