PM Modi Speech UAE Today : ఇటీవల అయోధ్య రామమందిరానికి, తాజాగా అబుదాబి హిందూ ఆలయ ప్రారంభోత్సవానికి ప్రత్యక్ష సాక్షి కావడం తన అదృష్టమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అబుదాబిలోని అతిపెద్ద హిందూ రాతి ఆలయం ప్రార్థనా స్థలం మాత్రమే కాదని, మానవాళి ఉమ్మడి వారసత్వానికి చిహ్నమని తెలిపారు. తాను ఆలయ పూజారిగా అర్హుడినో కాదో తెలియదని, కానీ తాను 'భరతమాత' పూజారినని చెప్పారు.
'చరిత్రలో యూఏఈ ఒక సువర్ణ అధ్యాయం'
అబుదాబిలోని అతిపెద్ద హిందూ దేవాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. బూర్జ్ ఖలీఫా, షేక్ జాయెద్ మసీదుకు ప్రసిద్ధి చెందిన యూఏఈ, ఇప్పుడు తన గుర్తింపునకు మరో సాంస్కృతిక అధ్యాయాన్ని జోడించిందని మోదీ చెప్పారు. మానవాళి చరిత్రలో యూఏఈ ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించిందని తెలిపారు. ఆలయ నిర్మాణంలో యూఏఈ ప్రభుత్వ పాత్రను ప్రశంసించడానికి మాటలు సరిపోవని అన్నారు.
నహ్యాన్‌దే ముఖ్యపాత్ర
"ఈ గొప్ప ఆలయాన్ని సాకారం చేయడంలో అత్యంత ముఖ్యమైన పాత్ర ఎవరిదంటే నా సోదరుడు (యూఏఈ అధ్యక్షుడు) షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్‌దే. అందుకు కృతజ్ఞతలు చెబుతున్నా. కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చడానికి యూఏఈ ప్రభుత్వం హృదయపూర్వకంగా పనిచేసింది. నహ్యాన్ ప్రభుత్వం ప్రవాస భారతీయుల హృదయాలను మాత్రమే కాకుండా మొత్తం 140 కోట్ల మంది భారత ప్రజల హృదయాలను కూడా గెలుచుకుంది. ఈ ఆలయాన్ని పెద్ద సంఖ్య పర్యటకులు దర్శించుకోనున్నారు" అని మోదీ తెలిపారు.
అంతకుముందు ఆలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం పూజారులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా బాప్స్ ఆలయాల్లో జరిగిన గ్లోబల్ హారతికి ఇచ్చారు. ఆలయ ప్రారంభానికి విచ్చేసిన ప్రధాని మోదీని చూసేందుకు భారత పౌరులు పెద్దఎత్తున తరలి వచ్చారు. ఇక బాలీవుడు నటుడు అక్షయ్ కుమార్, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
అబుదాబిలో హిందూ ఆలయ ప్రారంభోత్సవానికి హాజరైన 5000 మందికిపైగా ఆహ్వానితులకు లంగర్ భోజనాలను దుబాయ్‌లోని గురుద్వారా కమిటీ ఏర్పాటు చేసింది. ఉల్లి, వెల్లుల్లి లేకుండా తయారు చేసిన భోజనాన్ని వడ్డించింది. అన్ని మతాల పట్ల యూఏఈ అధికారుల నిబద్ధతకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఇదే సరైన మార్గమని గురుద్వారా కమిటీ ఛైర్మన్ సురేందర్ సింగ్ కంధారి తెలిపారు.
UAEలో అతిపెద్ద హిందూ ఆలయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
108 అడుగుల ఎత్తు- 5వేల మంది కళాకారుల శ్రమ- వెయ్యేళ్లు నిలిచేలా UAEలో హిందూ ఆలయం