G7 Summit 2024 : ఇటలీలో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తొలుత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో సమావేశమైన మోదీ, ఇరు దేశాల మధ్య రక్షణ, అణు, అంతరిక్ష రంగాలతో సహా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు. వీటితో పాటు పలు ప్రపంచ, ప్రాంతీయ సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ చర్చలు జరిపిన విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఔట్రీచ్లో ప్రసంగించిన మోదీ
అనంతరం జీ7 ఔట్రీచ్ కార్యక్రమంలోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. సాంకేతిక రంగంలో ఏకఛత్రాధిపత్యానికి అంతం పలకాలని మోదీ పిలుపునిచ్చారు. గతేడాది జరిగిన జీ20 సమావేశంలోనూ ఏఐ ఆవశ్యకతను చెప్పినట్లు గుర్తు చేశారు. ఇదే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఏఐ ఫర్ ఆల్ అనే విధానాన్ని అవలంభిస్తున్నట్లు వివరించారు.
ఆ తర్వాత బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తోనూ ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ద్వైపాక్షిక బంధం, ఉమ్మడి ప్రయోజనాలపై సునాక్‌తో మోదీ చర్చించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతోనూ మోదీ చర్చలు జరిపారు. రష్యా-ఉక్రెయిన్ వివాదానికి సంబంధించిన పలు అంశాలను ప్రధాని మోదీకి జెలెన్‌స్కీ వివరించినట్లు సమాచారం. గతేడాది మేలో హిరోషిమాలో జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మోదీని జెలెన్‌స్కీ కలిశారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య వివాదాన్ని చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలని భారత్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. మరోసారి అదే విషయాన్ని పునరుద్ఘాటిస్తూ, శాంతియుత పరిష్కారానికి భారత్ ఎల్లప్పుడూ మద్దతిస్తోందని మోదీ చెప్పారు.
మరోవైపు జీ-7 శిఖరాగ్ర సదస్సు కోసం ఇటలీలోని అపులియాకు వెళ్లిన ప్రధాని మోదీ ఆ దేశ ప్రధాని జార్జియా మెలోని గౌరవప్రదంగా స్వాగతం పలికారు. సంప్రదాయంగా మోదీకి నమస్కరించి ఆయన్ను పలకరించారు. జీ-7 సదస్సు కోసం వచ్చిన ఇతర దేశాధినేతలను కూడా మెలోనీ నమస్కారం చెబుతూ స్వాగతించారు. జీ-7 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ఇప్పటికే పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన మోదీ, అక్కడే పోప్ ఫ్రాన్సిస్‌ను ఆప్యాయంగా పలకరించారు. పోప్ ఫ్రాన్సిస్‌తోనూ మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారని తెలుస్తోంది.