Pilot Teasing Woman With Tomatoes : కొందరు ఆకతాయిలు రోడ్డు పక్కన వెళ్తున్న మహిళలు లేదా యువతులను బైక్‌ల మీద వెళ్తూ టీజ్ చేస్తుంటారు. ఇలాంటి ఘటనలను మనం చాలానే చూసి ఉంటాం. అయితే న్యూయార్క్‌కు చెందిన పైలట్ మాత్రం అందుకు భిన్నంగా ఫ్లైట్ నుంచి టమాటాలు విసురుతూ ఓ మహిళను కొన్నేళ్లుగా టీజ్ చేస్తున్నాడు. ఓ సారి ఇదే విషయంలో అరెస్ట్ అయ్యి విడుదలైనా టీజింగ్‌ను ఆపలేదు. దీంతో మరోసారి పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే?
సరటోగా కౌంటీ షెరీఫ్ కార్యాలయ వివరాల ప్రకారం, న్యూయార్క్‌లోని షుయ్లెర్ విల్లేకు చెందిన ఓ మహిళ స్థానికంగా కేఫ్ నడుపుతున్నారు. అదే ప్రాంతానికి చెందిన నిందితుడు ఆర్నాల్డ్(65) 2019 అక్టోబర్‌లో ఆమె కేఫ్‌కు వెళ్లాడు. ఇక అప్పటి నుంచి ఆమెను పలు విధాలుగా వేధించడం మొదలుపెట్టాడు. బాధితురాలి ఇంటిపై చిన్న విమానంలో చక్కర్లు కొడుతూ టమాటాలు విసిరేవాడు. దీంతో బాధితురాలు అప్పుడే పోలీసులను ఆశ్రయించింది.
ఆ షరతుతో విడుదల- కానీ!
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆర్నాల్డ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే మహిళలతోపాటు విమానాలకు దూరంగా ఉండాలనే షరతుపై పోలీసులు అతడిని విడుదల చేశారు. కానీ ఆర్నాల్డ్లో ఎలాంటి మార్పు లేదు. మళ్లీ కేఫ్ యజమానిని వేధించడం ప్రారంభించాడు. గత నెల జనవరి 12వ తేదీన మరోసారి ఆమె ఇంటిపై నుంచి విమానం ద్వారా టమాటాలు విసిరాడు. దీంతో బాధితురాలు మరోసారి ఫిర్యాదు చేసింది.
మొత్తం ఐదుసార్లు!
రంగంలోకి దిగిన పోలీసులు ఫిబ్రవరి 1వ తేదీన ఆరాల్డ్ను అరెస్ట్ చేశారు. వేధింపులు సహా పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. సరాటోగా టౌన్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం మరోసారి నిందితుడిని హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. ఈ విషయంపై అతడి న్యాయవాది స్పందించనట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతడి పేరులో స్థానిక పోలీస్ స్టేషన్లో ఇతర అభియోగాలు నమోదై ఉన్నాయి. ఇంతకుముందు నాలుగు సార్లు అరెస్ట్ అయిన ఆర్నెల్డ్, ఇప్పుడు మరోసారి అరెస్ట్ అవ్వడం గమనార్హం.