Nihon Hidankyo Nobel Peace Prize : అణ్వాయుధాలు లేని ప్రపంచం కోసం కృషి చేస్తున్న సంస్థకు అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. జపాన్‌కు చెందిన నిహోన్ హిడంక్యోకు ఈ ఏడాది శాంతి బహుమతి ఇస్తున్నట్లు నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. నిహాన్ హిడాంక్యో సంస్థ తమ అనుభవంతో ప్రజల్లో ఆశ, శాంతిని పెంపొదిస్తున్నట్లు కమిటీ ప్రశంసించింది.
భౌతికపరమైన సమస్యలు, జ్ఞాపకాలు వేధిస్తున్నా!
అణ్వాయుధాలు లేని ప్రపంచాన్ని సాధించడానికి హిరోషిమా, నాగసాకి అణుదాడుల నుంచి ప్రాణాలతో బయటపడిన వారితో హిడాంక్యో సంస్థ ఏర్పడింది. నోబెల్ శాంతి అవార్డుతో హిరోషిమా, నాగసాకి అణుబాంబు బాధితులను గౌరవిస్తున్నట్లు నార్వేయన్ నోబెల్ కమిటీ తన ప్రకటనలో తెలిపింది. భౌతికపరమైన సమస్యలు, జ్ఞాపకాలు వేధిస్తున్నా జపాన్ సంస్థ తమ అనుభవంతో ప్రజల్లో ఆశ, శాంతిని పెంపొదిస్తున్నట్లు కమిటీ వెల్లడించింది.
ఇప్పటివరకు104 సార్లు!
స్వీడన్‌కు చెందిన దిగ్గజ శాస్త్రవేత్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ వీలునామా మేరకు నోబెల్ పురస్కారాలు ఏర్పాటయ్యాయి. సోమవారం వైద్య విభాగంతో అవార్డుల ప్రకటన మొదలైంది. మంగళవారం భౌతికశాస్త్రం, బుధవారం రసాయనశాస్త్రం, గురువారం సాహిత్య విభాగాల్లో విజేతలను ప్రకటించారు. శుక్రవారం నోబెల్ శాంతి బహుమతిని వెల్లడించగా.. 14న ఆర్థికశాస్త్రంలో పురస్కార గ్రహీతల పేర్లను ప్రకటించనున్నారు. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి కోసం 197 మంది వ్యక్తులతో పాటు 89 సంస్థలు నామినేట్ అయినట్లు కమిటీ తెలిపింది. నోబెల్ శాంతి బహుమతిని 1901 నుంచి ఇస్తున్నారు. ఇప్పటివరకు104 సార్లు ఆ పురస్కారాన్ని అందించారు.
డిసెంబర్ 10న ప్రదానం
స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. 1896లో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ మరణించగా 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. అవార్డు గ్రహీతలకు 11 లక్షల స్వీడిష్ క్రోనర్ (10లక్షల డాలర్లు) నగదు అందుతుంది. డిసెంబర్ 10న నిర్వహించే కార్యక్రమంలో గ్రహీతలకు అవార్డులను అందజేస్తారు.