Nitrogen Gas Execution Alabama : సొంత ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదురైనప్పటికీ ప్రపంచంలోనే తొలిసారి ఒక దోషికి అమెరికాలోని అలబామా అధికారులు నైట్రోజన్ గ్యాస్‌తో మరణ శిక్ష అమలు చేశారు. మహిళను చంపిన కేసులో దోషిగా తేలిన 58 ఏళ్ల యూజీన్ స్మిత్- ఫేస్‌మాస్క్ ద్వారా స్వచ్ఛమైన నైట్రోజన్ గ్యాస్ పీల్చి ప్రాణాలు వదిలినట్లు అలబామా జైలు అధికాలులు తెలిపారు. 1982 నుంచి అమెరికాలో ప్రాణాంతక ఇంజెక్షన్‌తో దోషులకు మరణ దండన అమలు చేస్తున్నారు. 2022లో ఇంజెక్షన్‌తో స్మిత్‌కు మరణదండన అమలు చేసేందుకు ప్రయత్నించగా అతని నరాలకు IV లైన్ అనుసంధానం కాలేదని చివరి నిమిషంలో నిలిపివేశారు. ఈసారి నైట్రోజన్ గ్యాస్‌తో శిక్ష అమలు చేశారు.
ఈ మరణ శిక్షను అడ్డుకునేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నాలు జరిగాయి. ప్రయోగాత్మక మరణ శిక్ష పద్ధతులకు తనను ఓ పావుగా ఉపయోగించుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు దోషి స్మిత్. క్రూరమైన శిక్షలపై ఉన్న రాజ్యాంగపరమైన నిషేధాన్ని ఈ నిర్ణయం ఉల్లంఘిస్తోందని వాదించాడు. అయితే, వీటిని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. శిక్షను అడ్డుకోలేమని స్పష్టం చేసింది. దీంతో అతడికి నైట్రోజన్ గ్యాస్ ఇచ్చి శిక్ష అమలు చేశారు.
నైట్రోజన్ గ్యాస్ పీల్చిన సెకన్లలోనే దోషి స్పృహ కోల్పోతాడని, నిమిషాల్లోనే మరణం సంభవిస్తుందని అంతకుముందు అలబామా ప్రభుత్వం పేర్కొంది. నొప్పి లేకుండా, అత్యంత మానవీయంగా అమలు చేసే మరణ శిక్ష ఇదేనని చెప్పుకొచ్చింది.
కేసు ఇదీ
1988లో మత బోధకుడు చార్లెస్ సెన్నెట్ తన భార్యను హత్య చేయాలని బిల్లీ గ్రే విలియమ్స్‌కు డబ్బు ఇచ్చాడు. బిల్లీ తన స్నేహితులైన యూజీన్ స్మిత్, పార్కర్ల సాయంతో చార్లెస్ భార్య ఎలిజిబెత్‌ను హత్య చేశాడు. తర్వాత పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో చార్లెస్ ఆత్మహత్య చేసుకోగా, విలియమ్స్‌కు యావజ్జీవ ఖైదు, స్మిత్, పార్కర్‌లకు మరణశిక్ష పడింది. విలియమ్స్ జైల్లోనే అనారోగ్యంతో చనిపోగా పార్కర్‌కు ఇంజక్షన్ ఇచ్చి మరణదండన అమలు చేశారు. ఇప్పుడు యూజీన్ స్మిత్‌కు నైట్రోజన్ హైపోక్సియా పద్ధతిలో మరణశిక్ష అమలు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా విమర్శలు
నైట్రోజన్ హైపోక్సియా విధానంలో మరణ శిక్ష అమలుపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. ఐక్యరాజ్య సమితి సహా మానవ హక్కుల సంఘాలు ఈ పద్ధతిని వ్యతిరేకించాయి. ఈ శిక్షను నిలిపివేయాలని ఐరాస మానవ హక్కుల సంఘ కార్యాలయం అలబామాకు విజ్ఞప్తి చేసింది. అయితే అమెరికా కోర్టు ఈ విజ్ఞప్తులను తోసిపుచ్చింది.
'ఉరి శిక్ష వద్దు.. తుపాకీతో కాల్చితే బెటర్!.. కరెంట్ షాక్ ఎలా ఉంటుంది?'