Nobel Peace Prize 2024 : 2024 నోబెల్ శాంతి బహుమతిని అణ్వాయుధాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసే నిహాన్ హిడాంక్యో సంస్థ అందుకుంది. నార్వేలోని ఓస్లోలో జరిగిన కార్యక్రమంలో- ఆ సంస్థ తరఫున జపాన్‌పై జరిగిన అణుబాంబు దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన ఆ సంస్థకు చెందిన ముగ్గురు సభ్యులు అందుకున్నారు. నిహాన్ హిడాంక్యోను ఏర్పాటు చేసిన టెరుమి తనకా, షిగెమిట్సు తనకా, తోషియుకి మిమాకి ధ్రువపత్రంతో పాటు గోల్ట్ మెడల్‌ను అందుకున్నారు. ఈ సందర్భంగా అన్వస్త్రాల ద్వారా పొంచి ఉన్న ముప్పుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అణ్వాయుధాలకు వ్యతిరేకంగా శాంతి, అణ్వస్త్రరహిత ప్రపంచం కోసం గళమెత్తిన నిహాన్ హిడాంక్యో సంస్థకు ఈ అక్టోబర్‌లో నోబెల్ శాంతి బహమతిని అవార్డు కమిటీ ప్రకటించింది.
1945 ఆగస్టు 6న హిరోషిమాపై అగ్రరాజ్యం అమెరికా అణుబాంబు ప్రయోగించగా లక్షా 40 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అదే నెల 9న నాగసాకిపై అమెరికా మరో బాంబు వేయగా 70వేల మంది బలయ్యారు. నాటి విధ్వంసంలో ప్రాణాలు దక్కించుకున్నవారిని హిబాకుషాగా అభివర్ణిస్తుంటారు. వీరు, పసిఫిక్ అణ్వస్త్ర పరీక్షల బాధితులు కలిసి 1956లో నిహాన్ హిడాంక్యోను ఏర్పాటు చేశారు.