Machu Picchu Flooding : ప్రపంచ ప్రఖ్యాత 'మాచు పిచ్చు' చుట్టుపక్కల కొన్ని రోజుల క్రితం నదులు పొంగి వరదలు ముంచెత్తాయి. మట్టిచరియలు విరిగిపడ్డాయి. వరదలు తగ్గినా మాచు పిచ్చుకు వెళ్లే రోడ్లు, రైలు మార్గాల్లో ఎక్కడికక్కడ బురద పేరుకుపోయింది. పెరూలో ఉన్న ఈ ప్రపంచ వింతను చూద్దామని వచ్చే పర్యటకులకు తిప్పలు తప్పడం లేదు. బురద వల్ల రాకపోకలకు అంతరాయమే కాక కొన్ని ప్రమాదాలు జరిగాయి. ఇందులో ఇద్దరు స్థానికులు అదృశ్యమవ్వగా, మరో 17మందికి గాయాలయ్యాయి. కనిపించకుండాపోయిన ఇద్దరిని వెతకడానికి సహాయక సిబ్బంది రంగంలోకి దిగింది. బురదల్లో చిక్కుకున్న వారిని చెట్ల దుంగలు, తాళ్ల సాయంతో రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు.
మాచు పిచ్చులో బురద వల్ల అక్కడున్న ప్రైవేటు రైల్వే సంస్థ వాటి సేవలను రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. రోడ్లు, రైలు మార్గాలను పునరుద్దరించడానికి మరికొద్ది రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. పరిస్థితి చక్కదిద్దే వరకూ సహాయక చర్యలు కొనసాగుతాయని వెల్లడించారు. ప్రముఖ పర్యటక ప్రాంతంలో వరదలు ముంచెత్తడం వల్ల పర్యటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఒక్క పర్యటకుడి మాచు పిచ్చు తెరిచిన అధికారులు
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో ఒక్క పర్యటకుడి కోసం మాచు పిచ్చును తెరిచారు అధికారులు. జపాన్‌కు చెందిన 26ఏళ్ల జెస్సీ కటయమా మాచు పిచ్చు సందర్శన కోసం పెరూ వెళ్లారు. దీంతో కటయమా వెళ్లిన కొద్ది రోజులకే పెరూ దేశం ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించింది. అంతర్జాతీయ విమానాలు రద్దు చేసింది. పర్యటక ప్రాంతాలు, రద్దీ ప్రదేశాలను మూసివేసింది. అలా కటయమా కొన్నాళ్ల నుంచి పెరూలో చిక్కుకుపోయారు.
ఈ క్రమంలో జెస్పీ కటయమా గురించి స్థానిక పర్యటక అధికారులకు తెలిసింది. దీంతో అతడు మాచు పిచ్చు చూసేందుకు అధికారులు ప్రత్యేకంగా అనుమతి కల్పించారు. కేవలం అతడి కోసమే కాసేపు ఆ కట్టడాన్ని తెరిచారు. టూరిస్టు పర్యటన పూర్తయిన తర్వాత మళ్లీ మాచు పిచ్చు మూసేశారు. ఈ సందర్భంగా జెస్సీ కటయమా సంతోషం వ్యక్తం చేశారు. మాచు పిచ్చును చూస్తానని అనుకోలేదని, కానీ అధికారుల సాయంతో ఈ ప్రత్యేక అవకాశం వచ్చిందని చెప్పారు. పెరూ ప్రభుత్వం, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.