Lok Sabha Polls Microsoft : దేశంలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా లోక్‌సభఎన్నికలపై డ్రాగన్ ప్రభుత్వం ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ ఓ రిపోర్టులో తెలిపింది. కృత్రిమ మేధస్సుతో రూపొందించిన కంటెంట్‌ను ఉపయోగించి భారత్, అమెరికా, దక్షిణ కొరియాలో జరగనున్న ఎన్నికలకు విఘాతం కలిగించేందుకు చైనా సిద్ధమవుతోందని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది.
ఈ ఎన్నికల సమయంలో తమ ప్రయోజనాలకు అనుకూలంగా మార్చుకునేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా ఏఐ ఆధారిత కంటెంట్‌ను చైనా ప్రచారం చేసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మీమ్స్, వీడియోలు, ఆడియో రూపంలో ప్రచారం చేయవచ్చని మైక్రోసాఫ్ట్ ఆందోళన వ్యక్తం చేసింది. డీప్‌ఫేక్ సాంకేతికతను కూడా ఉపయోగించి చైనా తమకు అనుకూలంగా ఎన్నికల ప్రచారాన్ని మార్చుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే, ఇలాంటి కుయుక్తులు సార్వత్రిక ఎన్నికల్లో తక్కువ ప్రభావం చూపుతుందని రిపోర్టులో తెలిపింది.
అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో కూడా
ఉత్తరకొరియా ప్రమేయంతో చైనా మద్దతు గల సైబర్ గ్రూపులు 2024లో జరగనున్న అనేక దేశాల ఎన్నికలను లక్ష్యంగా చేసుకున్నాయని మైక్రోసాఫ్ట్ అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకు కృతిమ మేథస్సును అస్త్రంగా చేసుకున్నాయని ఆరోపించింది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఈయూతో పాటు దాదాపు 64 దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయని పేర్కొంది. ఈ దేశాలు మొత్తం ప్రపంచ జనాభాలో దాదాపు 49 శాతం వాటా కలిగి ఉన్నాయని వివరించింది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా భారత్, దక్షిణ కొరియా, అమెరికా దేశాల్లో చైనా తన ప్రయోజనాల నిమిత్తం ఏఐ కంటెంట్‌ను ఉపయోగించొచ్చని అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది. తప్పుడు ప్రచారాలతో ఓటర్లను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని హెచ్చరించింది. చైనా ఎత్తుగడలను అడ్డుకోకపోతే ఓటర్ల సామర్థ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందన్నారు. ఎన్నికల్లో వీటి ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ కాలక్రమేణా మరింత ప్రభావవంతంగా మారగలవని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది.
తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో ఏఐ
ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో తైవాన్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఏఐ ఆధారిత తప్పుడు కంటెంట్‌ను చైనా వ్యాప్తి చేయించిందని మైక్రోసాఫ్ట్ ఆరోపించింది. స్టార్మ్ 1376 లేదా స్పామౌఫ్లేజ్ అనే చైనా మద్దతుగల సైబర్ సంస్థ చురుకుగా పనిచేసిందని హెచ్చరించింది. కొంతమంది అభ్యర్థలను ప్రతిష్ఠను దెబ్బతీసి, ఓటర్లను ప్రభావం చేసేందుకు నకిలీ ఆడియో ప్రచారాలు, మీమ్‌లతో సహా ఏఐ ఆధారిత రూపొందించిన కంటెంట్‌ని ఆ సంస్థ ప్రచారం చేసిందని తెలిపింది.ఇందులో ఇరాన్ హస్తం కూడా ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. విదేశీ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఒక ప్రభుత్వ సంస్థ ఏఐ కంటెంట్‌ను వినియోగించడం ఇదే తొలిసారి అని మైక్రోసాఫ్ట్ పేర్కొంది.
'దుర్వినియోగం చేస్తే ప్రమాదమే'
గతనెలలో దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఏఐ సాంకేతికతో ఎదురవుతున్న సరికొత్త సవాళ్లపై చర్చించారు. ఏఐ శక్తిమంతమైనదే, కానీ సరైన శిక్షణ లేకుండా దీన్ని అందిస్తే దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని బిల్‌గేట్స్ హెచ్చరించారు. తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడితే వక్రమార్గంలో పయనిస్తుందని భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో డీప్‌ఫేక్‌ను ఎవరైనా వినియోగించొచ్చని చెప్పారు. ఏఐ పెద్ద అవకాశమని అయితే సవాళ్లు ఉన్నాయని బిల్‌గేట్స్ ఆందోళన వ్యక్తం చేశారు
న్యూయార్క్‌లో భూకంపం- గాజాపై చర్చిస్తుండగా 'ఐరాస'లో ప్రకంపనలు - New York Earthquake Today