Kami Rita Climbs Mt Everest For 29th Time : ఎవరెస్ట్ మ్యాన్‌గా పేరొందిన 54 ఏళ్ల నేపాలీ షెర్పా కమీ రీటా మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. 29వసారి కూడా ఎవరెస్టును అధిరోహించి తన రికార్డును తానే తిరగరాసుకున్నాడు. ప్రపంచంలో వ్యక్తిగతంగా ఎక్కువసార్లు ఎవరెస్టును అధిరోహించిన వ్యక్తిగా కమీ రీటా నిలిచాడు. ఆదివారం ఉదయం 7:25 గంటలకు 8848.86 మీటర్ల ఎత్తైన ఎవరెస్టు శిఖరానికి అతడు చేరుకున్నాడు. ఈవిషయాన్ని 'సెవెన్ సమ్మిట్ ట్రెక్స్' అనే సంస్థ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది.
సీనియర్ గైడ్ హోదాలో తమ సంస్థకు చెందిన ఔత్సాహిక ట్రెక్కర్ల టీమ్‌ను గైడ్ చేస్తూ మరోసారి ఎవరెస్టుపైకి కమీ రీటా చేరుకున్నాడని 'సెవెన్ సమ్మిట్ ట్రెక్స్' తెలిపింది. ఇందుకుగానూ అతడికి అభినందనలు తెలిపింది. నేపాల్ ప్రభుత్వ పర్యాటక శాఖ అధికారులు కూడా ఈ వివరాలను ధ్రువీకరించారు. గతేడాది సరిగ్గా ఇదే టైంలో కమీ రీటా షెర్పా ఎవరెస్టు శిఖరాన్ని వారం వ్యవధిలో రెండుసార్లు అధిరోహించాడు. ఇప్పుడు మరోసారి ఆ ఫీటును చేసి చూపించాడు.
ఈసారి ఎవరెస్టుపైకి వెళ్లే ముందు మీడియాతో కమీ రీటా మాట్లాడారు. ''ఇన్నిసార్లు అన్నిసార్లు అని కాదు ఎన్నిసార్లు ఎవరెస్టును ఎక్కాలనే దానిపై తాను ఇంకా లెక్కలు వేసుకోలేదు'' అని చెప్పాడు. దీన్నిబట్టి భవిష్యత్తులోనూ మరిన్ని సార్లు ఎవరెస్టును ఎక్కాలనే తన బలమైన సంకల్పాన్ని అతడు బయటపెట్టాడు.
అయితే, పసాంగ్ దావా అనే మరో షెర్పా కూడా గత ఏడాది 27వసారి ఎవరెస్టును అధిరోహించాడు. అయితే మరోసారి ఆయన ఆ ప్రయత్నం చేస్తారా ? లేదా ? అనే దానిపై క్లారిటీ లేదు.
ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌నకు ఆరేళ్ల బాలుడు
గత నెల, హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పుర్‌కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. అనేక ప్రతికూల పరిస్థితులను తట్టుకుని కూడా ఆ బాలుడు తల్లిదండ్రులతో కలిసి తన లక్ష్యాన్ని సాధించాడు. ప్రస్తుతం యువన్ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.