Kamala Harris Acceptance Speech : తాను అధ్యక్షురాలిగా ఎన్నికైతే అమెరికా వలస విధానాన్ని పూర్తిగా సంస్కరిస్తామని డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ సహా నాటో కూటమి దేశాలకు అండగా ఉంటామని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై ఆమె విరుచుకుపడ్డారు. ఆయన నిబద్ధత ఉన్న నాయకుడు కాదని విమర్శించారు. ట్రంప్ మళ్లీ ఎన్నికై తిరిగి శ్వేతసౌధంలోకి అడుగుపెడితే, తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అధికారికంగా స్వీకరిస్తూ, డెమొక్రటిక్ పార్టీ జాతీయ సమావేశంలో గురువారం ఆమె ప్రసంగించారు.
దేశ భవిష్యత్తు కోసం కొత్త బాటలు
"పార్టీ, జాతి, లింగం, భాషతో సంబంధం లేకుండా ప్రతి అమెరికన్ తరపున యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్ష పదవికి మీ నామినేషన్‌ను అంగీకరిస్తున్నాను" అని కమలా హారిస్ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. డీఎన్‌సీ చివరి రోజు సమావేశానికి ఆమె మద్దతుదారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. చప్పట్లు, స్టాండింగ్ ఒవేషన్‌లు, నినాదాలు, ప్లకార్డులతో కమలా హారిస్‌కు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అమెరికాను ఐక్యం చేస్తూ దేశ భవిష్యత్తు కోసం పనిచేసే అధ్యక్షురాలిగా నిలుస్తానని ఆమె ఇచ్చిన హామీని, డెమోక్రటిక్ పార్టీ కార్యకర్తలు తమ కరతాళధ్వనులతో స్వాగతించారు.
గతంలో ఎదుర్కొన్న విభజన, విద్వేషం వంటి సమస్యలను అధిగమించడానికి ఈ ఎన్నికలు గొప్ప అవకాశమని కమలా హారిస్ తెలిపారు. పార్టీ, వర్గాలుగా చీలిపోకుండా అమెరికన్లుగా కొత్త మార్గాన్ని సృష్టించుకుందామని ఆమె పిలుపునిచ్చారు. తాను అధికారంలోకి వస్తే 21 శతాబ్ది విజేతగా అమెరికాను నిలుపుతానని అన్నారు. ఎట్టిపరిస్థితుల్లో చైనాకు ఆ అవకాశం ఇవ్వబోమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అమెరికాను మరింత బలోపేతం చేస్తానని, ప్రపంచ నాయకత్వాన్ని త్యజించేది లేదని హామీ కమలా హారిస్ పేర్కొన్నారు.
ట్రంప్‌నకు పట్టపగ్గాలుండవు!
ఈ సందర్భంగా ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై కమలా హారిస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన విధానాలన్నీ దేశాన్ని వెనక్కి తీసుకెళ్తాయని విమర్శించారు. ఈ ఎన్నికలు దేశ చరిత్రలో చాలా కీలకంగా నిలవనున్నాయన్నారు. ట్రంప్‌నకు అధికారం లభిస్తే, పట్టపగ్గాల్లేకుండా వ్యవహరిస్తారని దుయ్యబట్టారు. ఆయన నిబద్ధతలేని వ్యక్తి అని, ఆయన్ని శ్వేతసౌధంలోకి మళ్లీ పంపితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కమల వ్యాఖ్యానించారు. 2020 ఎన్నికల తర్వాత అధికార బదిలీ సందర్భంగా జరిగిన ఆందోళనలను కూడా ఆమె ప్రస్తావించారు. ట్రంప్ ఏకంగా క్యాపిటల్ హిల్‌పైనే దాడికి ఉసిగొల్పారని ఆమె ఆరోపించారు. సొంత పార్టీ నేతలే ఘర్షణలను నిలువరించాలని కోరినా, ఆయన మాత్రం వాటికి మరింత ఆజ్యం పోశారని పేర్కొన్నారు. తాను మాత్రం అలా చేయబోనని, శాంతియుతంగా అధికార బదిలీకి సహకరిస్తానని హామీ ఇచ్చారు.
బైడెన్ స్ఫూర్తిదాయకం!
అమెరికా అధ్యక్షుడు జో బైడన్‌పై కమలా హారిస్ మరోసారి పశంసలు కురిపించారు. ఆయన ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆయన చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. అంతకు ముందు జో బైడెన్ దంపతులు సైతం కమలా హారిస్ ప్రసంగం కోసం ఆత్రుతగా వేచిచూస్తున్నామంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. హారిస్, ఉపాధ్యక్ష అభ్యర్థి టిమ్ వాల్జ్ కలిసి దేశానికి గొప్ప భవిష్యత్తును అందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
తల్లి స్ఫూర్తితో
'మన జీవిత కథలకు మనమే రచయితలుగా ఉండాలి' అని తల్లి చెప్పిన మాటలే తనను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టాయని కమలా హారిస్ అన్నారు. అమ్మ జీవిత ప్రయాణం నుంచి తాను ఎంతో నేర్చుకున్నట్లు తెలిపారు. అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అధికారికంగా స్వీకరిస్తూ తన తల్లి డా. శ్యామలా గోపాలన్ హారిస్ గురించి కమల ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఆమె నా గురించే మాట్లాడుతోందా? - ట్రంప్ సెటైర్
'ఆమె నా గురించే మాట్లాడుతోందా?' అంటూ షికాగోలోని డెమోక్రటిక్ పార్టీ జాతీయ సదస్సులో కమలా హారిస్ ప్రసంగాన్ని లైవ్‌లో వీక్షిస్తూ మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ సెటైర్లు వేశారు. ఆయన ట్రూత్ సోషల్ వేదికగా ఈ వ్యాఖ్య చేశారు. కమలా ప్రసంగంపై ట్రంప్ స్పందిస్తూ "ఆమె బాల్యంలో సంగతులు చాలా వెల్లడించింది, థాంక్యూలు చాలా వేగంగా చెప్పింది. ఇక ఇప్పుడు చెబుతున్న పాలసీ ప్రతిపాదనలను ఉపాధ్యక్షురాలిగా ఉన్నప్పుడే ఎందుకు చేపట్టలేదు" అని ఆయన ప్రశ్నించారు.
హారిస్ ఇప్పుడు కొత్తగా ముందుకుపోవడానికి ప్రణాళికలు చెబుతున్నారని, కానీ మూడున్నరేళ్ల సమయంలో పని చేయడానికి అవకాశం లభించినా, అమెరికాకు అపకారం తప్పితే మరేమీ చేయలేదన్నారు. ఇక హారిస్ ప్రాజెక్టు 2025 గురించి ప్రస్తావించడాన్ని ట్రంప్ తిప్పికొట్టారు. "ఆమె ప్రాజెక్టు 2025 గురించి మరోసారి అబద్ధాలు ఆడుతోంది. ఆమెకు ఆ విషయం బాగా తెలుసు. వాటితో నాకేమాత్రం సంబంధం లేదు" అని ట్రంప్ పోస్టులో పేర్కొన్నారు. కామ్రేడ్ కమలా హారిస్ హయాంలో ఎలాంటి పురోగతి ఉండదని ట్రంప్ ఎద్దేవా చేశారు. ఎందుకంటే ఆమె మనల్ని నూక్లియర్ వరల్డ్‌వార్-3లోకి తీసుకెళుతుందని ఆరోపించారు. ఆమెను ప్రపంచంలోని నియంతలు లెక్క చేయరని ట్రంప్ అన్నారు.