Kamala Harris Challenges To Trump : డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. తనతో ముఖాముఖి డిబేట్ కోసం సిద్ధం కావాలని ట్రంప్‌కు సవాల్ విసిరారు. నవంబరులో జరిగే అధ్యక్ష అభ్యర్థుల డిబేట్‌లో పాల్గొనాలనే ఆసక్తి లేదని, తానెవరో, కమల ఎవరో అమెరికన్లకు బాగా తెలుసని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై జార్జియా జరిగిన డెమొక్రటిక్ పార్టీ సమావేశంలో ఈ మేరకు ఘాటుగా స్పందించారు.
'ట్రంప్ తప్పకుండా మీరు నాతో ముఖాముఖి డిబేట్‌కు వస్తారని ఆశిస్తున్నాను. మీరు ఏదైనా చెప్పదల్చుకుంటే అక్కడ నా మొహం మీదే చెప్పేయొచ్చు. ఇప్పటికే అధ్యక్ష ఎన్నికల పోటీలో తేడా కనిపిస్తోంది. అది మీకు అర్ధమవుతుంది. ప్రజలు కూడా ఈ మార్పును గమనిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలంటే జార్జియా రాష్ట్రం మద్దతు తప్పనిసరి. 2020లో జరిగిన ఎన్నికల్లో జార్జియా ప్రజలు డెమొక్రటిక్ పార్టీకి మద్దతుగా నిలిచారు. 2024లో కూడా అదే పని చేస్తారు. తాను అమెరికా అధ్యక్షురాలు అయిన వెంటనే ద్వైపాక్షిక ఇమిగ్రేషన్ చట్టాన్ని అమల్లోకి తెస్తా. తద్వారా అమెరికాలోకి పొరుగు దేశాల నుంచి అక్రమ వలసలను నివారిస్తా. ఈ విషయంలో ట్రంప్‌కు చిత్తశుద్ధి లేదు. ఈ చట్టం రూపుదాల్చకుండా రిపబ్లికన్ పార్టీ నేతలు పదేపదే అడ్డుపడుతున్నారు' అని కమలా హారిస్ ధ్వజమెత్తారు.
మెజారిటీ డెమొక్రాట్ల మద్దతు కమలకే
కమలా హారిస్ అధ్యక్ష అభ్యర్థిత్వంపై ప్రతీ 10 మంది డెమొక్రటిక్ పార్టీ క్యాడర్‌లో 8 మంది సంతృప్తిగా ఉన్నారని 'ది అసోసియేటెడ్ ప్రెస్ - ఎన్‌ఓఆర్‌సీ సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసెర్చ్' తాజా సర్వేలో వెల్లడైంది. ఆ పార్టీ తరఫున పోటీ నుంచి బైడెన్ వైదొలగిన తర్వాత డెమొక్రాట్లు పెద్దఎత్తున కమలకు మద్దతుగా నిలబడుతున్నట్లు సర్వే నివేదిక తేల్చింది. డెమొక్రాట్లు బలంగా ఉన్న చాలా రాష్ట్రాల మద్దతును చాలా తక్కువ టైంలో కమల కూడగట్టగలిగారని పేర్కొంది. ట్రంప్‌ను ఢీకొనే సత్తా కమలకు ఉందనే అభిప్రాయానికి డెమొక్రటిక్ పార్టీ కీలక నేతలు వచ్చారని నివేదికలో ప్రస్తావించారు. వయసు రీత్యా పెద్దవాడైన ట్రంప్ కంటే కమలా హారిస్‌కే అమెరికా అధ్యక్షురాలయ్యే అవకాశం ఇవ్వడం మేలనే భావనకు 45 ఏళ్లలోపు అమెరికన్లు వచ్చారని సర్వేలో గుర్తించారు. అమెరికా అధ్యక్ష పదవికి మహిళను లేదా మరో వర్ణానికి చెందిన వారికి అవకాశం ఇవ్వడం మంచి విషయమేనని ప్రతి 10 మంది అమెరికన్లలో నలుగురు అభిప్రాయపడినట్లు సర్వే నివేదిక వెల్లడించింది.
'కమల ప్రమాదకర ఉదారవాది'
మరోవైపు కమలా హారిస్‌ను టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద యాడ్ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. ఆ యాడ్‌లో 'అత్యంత ప్రమాదకర ఉదారవాది' (డేంజరస్‌లీ లిబరల్)గా కమలను ప్రస్తావించడం గమనార్హం. 'అమెరికా వైస్ ప్రెసిడెంట్ హోదాలో కమల విఫలమయ్యారు. దేశ దక్షిణ సరిహద్దు నుంచి అక్రమ వలసను ఆమె నివారించలేకపోయారు. అమెరికా భద్రతను ప్రశ్నార్ధకంగా మార్చారు. కమలా హారిస్ పాలనాపరమైన వైఫల్యాలకు అమెరికా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. దేశ సరిహద్దులను తెరిచి ఉంచాలని కమల భావిస్తున్నారు. లక్షలాది అక్రమ వలసదారులను అమెరికాలోకి అనుమతించాలని ఆమె అనుకుంటున్నారు. వాళ్లకు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు' అని యాడ్ క్యాంపెయిన్‌లో ఆరోపించారు. అయితే ఇదంతా దుష్ప్రచారమని కమలా హారిస్ తరఫు ప్రచార బృందం ఖండించింది.
'ప్రతి ఓటును సంపాదిస్తా!'- డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఫిక్స్
'అమెరికాను పాలించే అర్హత ఆమెకు లేదు'- కమలా హారిస్‌పై ట్రంప్ ఇంటెన్స్ అటాక్!