Joe Biden On Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశానికి చాలా ప్రమాదకరమని అధ్యక్షుడు జో బైడెన్ ప్రజలను హెచ్చరించారు. పగ, ప్రతీకారంతో బరిలోకి దిగుతున్న ట్రంప్‌ను రాబోయే ఎన్నికల్లో తిరస్కరించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఉభయ సభలనుద్దేశించి ప్రతీ ఏడాది చేసే స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ వార్షిక సమావేశంలో అధ్యక్షుడు తమ ప్రభుత్వ విధానాలు, ప్రాథమ్యాలు, భవిష్యత్ కార్యాచరణను ప్రజల ముందు ఉంచుతారు. రెండోసారి అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న బైడెన్ తాజాగా ఈ వేదికను తన అభ్యర్థిత్వాన్ని బలపర్చుకోవడం కోసం ఉపయోగించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
'ద్వేషానికి తావివ్వొద్దు'
ద్వేషానికి ఎక్కడా తావివ్వొద్దని ఇప్పుడు కొంత మంది పగ, ప్రతీకారంతో కూడిన అమెరికాను చూస్తున్నారని పరోక్షంగా ట్రంప్‌పై బైడెన్ తీవ్ర విమర్శలు చేశారు. ఉక్రెయిన్‌కు మరింత సాయం అందించేందుకు సహకరించాలని కాంగ్రెస్‌ను కోరారు. ఔషధ ధరలను తగ్గించటం, కఠిన వలస విధానాల రూపకల్పనపై కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. కరోనా ఉద్ధృతి, ఆర్థిక వృద్ధి క్షీణిస్తున్న సమయంలో 2021లో తాను అధికారంలోకి వచ్చానని బైడెన్ గుర్తు చేశారు. తన హయాంలో తీసుకున్న నిర్ణయాల వల్ల అమెరికా భవిష్యత్తు మెరుగ్గా ఉండనుందని చెప్పారు. కానీ, ట్రంప్ అధికారంలోకి వస్తే మాత్రం అది పూర్తిగా దెబ్బతింటుందన్నారు. తన వయసుపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు బైడెన్. వయసు ముఖ్యం కాదని విధానాలపైనే దృష్టి సారించాలని వ్యాఖ్యానించారు.
గాజాలో ఇజ్రాయెల్ యుద్ధానికి మద్దతునివ్వటంపై సొంత పార్టీ నుంచే బైడెన్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. బైడెన్ తన తాజా ప్రసంగంలో వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఇరు పక్షాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి కృషి చేస్తున్నామని ప్రకటించారు. గాజాకు మానవతా సాయం అందించడం కోసం ప్రత్యేకంగా ఓ నౌకాశ్రయాన్నే ఏర్పాటు చేశామని చెప్పారు. మరింత సాయాన్ని అందించేందుకుగానూ కాంగ్రెస్ మద్దతు కోసం చేస్తున్న ప్రయత్నాలకు రిపబ్లికన్లు అడ్డు నిలుస్తున్నారని ఆరోపించారు.
సూపర్ ట్యూస్‌డే ప్రైమరీ ఎన్నికల్లో గెలుపు తర్వాత రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్, డెమోక్రాటిక్ నుంచి బైడెన్ అధ్యక్ష పీఠం కోసం మరోసారి తలపడడం దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలో తాజా వార్షిక ప్రసంగంలో ట్రంప్‌పై బెడెన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన గెలుపు దేశానికి చాలా ప్రమాదమని వ్యాఖ్యానించారు.
ఎన్నికల బరి నుంచి నిక్కీ హేలీ ఔట్- అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్
15 రాష్ట్రాల ప్రైమరీల్లో బైడెన్, ట్రంప్ హవా - అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ 'ఢీ'!