Joe Biden Preemptive Pardons : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఆయన అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగడానికి ముందే కొందరు అధికారులు, అలాగే తన మిత్రులకు క్షమాభిక్ష అమలుచేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు అక్కడి వార్తా పత్రికల్లో పలు కథనాలు వెలువడ్డాయి.
అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని రోజుల్లో అధికార బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బైడెన్ అనుకూలదారులు, అధికారులను, మిత్రులను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందంటూ ప్రస్తుత అధ్యక్షుడు భావిస్తున్నారు. అందుకే తాను బాధ్యతల నుంచి వైదొలిగే ముందే వారందరికీ క్షమాభిక్ష అమలుచేయాలే ఆలోచనలో ఉన్నారట. దీని గురించి పలు సీనియర్ సహాయకులు, వైట్‌హౌస్ లాయర్లతో చర్చలు జరుపుతున్నట్లు అక్కడి అధికార వర్గాలు తెలిపాయి.
ఆయన క్షమాభిక్ష అమలు చేయాలనుకున్న వారి లిస్ట్‌లో మాజీ ప్రత్యేక సలహాదారు ఆంథోనీ ఫౌసీ, కాలిఫోర్నియాకు చెందిన డెమోక్రటిక్ ప్రతినిధి ఆడమ్ షిఫ్, ట్రంప్‌ను తీవ్రంగా విమర్శించే మాజీ చట్టసభ సభ్యుడు లిజ్ చెనీ, రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లీ తదితరులు ఉన్నట్లు సమాచారం. 'ఇతర క్షమాపణలు అంశంపై బైడెన్ సమీక్షిస్తున్నారు' అంటూ వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్- పియర్ తాజాగా వెల్లడించారు.
మరోవైపు డొనాల్డ్ ట్రంప్ కూడా తన పదవీకాలం చివరిలో మాజీ ప్రధాని రిపబ్లికన్ నిధుల సమీకరణదారు ఇలియట్ బ్రాడీ, మాజీ చీఫ్ స్ట్రాటజిస్ట్ స్టీవ్ బానన్‌తో సహా 74 మందికి క్షమాభిక్షను అమలు చేశారు.
ఇదీ జరిగింది :
2018లో తుపాకీ కొనుగోలు నేపథ్యంలో ఆయుధ డీలరుకు ఇచ్చిన అఫ్లికేషన్ ఫారంలో హంటర్ తప్పుడు సమాచారం ఇచ్చారు. అయితే తాను అక్రమంగా డ్రగ్స్ కొనుగోలు చేయలేదని, వాటికి బానిస కాలేదని, అంతేకాకుండా తనవద్ద ఎటువంటి అక్రమంగా ఆయుధం లేదని వెల్లడించారు. కానీ హంటర్ అప్పటికే డ్రగ్స్ అక్రమంగా కొనుగోలు చేయడం, వాటికి బానిస కావడంతో పాటు 11 రోజులపాటు అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నారు. దీంతో పాటు కాలిఫోర్నియాలో 1.4 మిలియన్ డాలర్ల పన్ను ఎగవేత ఆరోపణల విషయంలోనూ ఆయనపై ఓ కేసు నమోదైంది.
అక్రమ ఆయుధం కొనుగోలు విషయంలో హంటర్‌పై నమోదైన కేసులో ఈ ఏడాది జూన్‌లో న్యాయస్థానం ఆయన్ను దోషిగా తేల్చింది. అయితే, ఇప్పటివరకు ఎటువంటి శిక్ష ఖరారు చేయలేదు. ఈ క్రమంలోనే అధ్యక్షుడు జోబైడెన్ కుమారుడికి క్షమాభిక్ష కల్పిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా తన కుమారుడిపై కేసులు రాజకీయ ప్రేరేపితమైనవేనంటూ ఆయన ఆరోపించారు.
మాటతప్పిన బైడెన్ - దోషిగా తేలిన కుమారుడికి క్షమాభిక్ష
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని మార్చేలా అమెరికా కీలక నిర్ణయం- ఇక పుతిన్‌కు కష్టాలు తప్పవా?