Israel Strikes Hezbollah : శుక్రవారం లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ కనీవినీ ఎరుగని స్థాయిలో విరుచుకుపడింది. బాంబుల వర్షం కురిపించింది. హెజ్‌బొల్లా అధిపతి హసన్ నస్రల్లా లక్ష్యంగా ఈ దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో ఆయన మరణించారా? లేదా సురక్షితంగా ఉన్నారా? అనే దానిపై స్పష్టత లేదు. అయితే ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లా కుమార్తె జైనబ్ నస్రల్లా మృతి చెందినట్లు సమాచారం. అయితే దీనిపై హెజ్‌బొల్లా నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతానికి నస్రల్లా సురక్షితంగా ఉన్నారని హెజ్‌బొల్లా వర్గాలు చెబుతున్నా, ఇజ్రాయెల్ మాత్రం ఇంకా ధ్రువీకరించుకోవాల్సి ఉందని అంటోంది.
దద్ధరిల్లిన బీరుట్
నస్రల్లా గురించిన సమాచారాన్ని సేకరిస్తున్నామని ఇరాన్ కూడా తెలిపింది. దక్షిణ లెబనాన్‌లోని దాహియాలోని నివాస గృహాల కింద భూగర్భంలో ఉన్న హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై విధ్వంసకర బాంబులను ఇజ్రాయెల్ ప్రయోగించింది. దీంతో దాహియాతో పాటు, బీరుట్‌లోని చాలా ప్రాంతాలు దద్దరిల్లాయి. చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. దాదాపు 8 భవంతులు సమూలంగా ధ్వంసమయ్యాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దాహియా హెజ్‌బొల్లాకు బాగా పట్టున్న ప్రాంతం. అందుకే గత వారం రోజులుగా ఈ ప్రాంతాన్నే లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) పదే పదే దాడులు నిర్వహిస్తోంది. దాదాపు 18 మంది హెజ్‌బొల్లా అగ్రశ్రేణి కమాండర్లను ఐడీఎఫ్ మట్టుబెట్టింది కూడా ఈ దాహియా ప్రాంతంలోనే. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 79వ సదస్సులో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రసంగం ముగిసిన కొన్ని నిమిషాలకే ఈ భీకర దాడికి ఐడీఎఫ్ దిగడం గమనార్హం. న్యూయార్క్‌లోని తన హోటల్ గది నుంచే ఈ వైమానిక దాడికి నెతన్యాహు ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. ఐరాసలో ప్రసంగం ముగిసిన వెంటనే ఆయన అమెరికా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని ఇజ్రాయెల్ పయనమయ్యారు.
హమాస్ లొంగితేనే యుద్ధాన్ని ఆపుతాం!
ఐక్యరాజ్యసమితి సదస్సులో హెజ్‌బొల్లాపై నెతన్యాహు నిప్పులు చెరిగారు. ఆ మిలిటెంట్ సంస్థను చావుదెబ్బ తీస్తామని హెచ్చరించారు. లెబనాన్ నుంచి రోజువారీ రాకెట్ల దాడులను సహించేది లేదని అన్నారు. హమాస్ పూర్తిగా లొంగిపోయి, ఆయుధాలు వీడి, బందీలను విడిచిపెడితేనే గాజా యుద్ధం ఆగుతుందని నెతన్యాహు తేల్చి చెప్పారు. అప్పటి వరకు దాడులు ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. "90 శాతం హమాస్ రాకెట్లను నాశనం చేశాం. వారి సగం బలగాలను అంతం చేయడమో, బంధించడమో చేశాం. వారు లొంగకపోతే పూర్తి విజయం సాధించే వరకు పోరాడతాం. మా పౌరులను సురక్షితంగా వారి నివాసాలకు తిరిగి వచ్చేలా చూసే హక్కు మాకుంది. అదే పని మేం చేస్తున్నాం. మా లక్ష్యాలను చేరే వరకు హెజ్‌బొల్లాపై పోరాటం కొనసాగిస్తాం. ఏడాది కాలంగా ఈ పరిస్థితులను సహిస్తూనే వస్తున్నాం" అని ఐరాస వేదికగా బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. తాను ఈ సదస్సుకు రాకూడదని నిర్ణయించుకున్నానని, కానీ ఈ వేదికపై నిలబడి చాలా మంది నాయకులు అబద్ధాలు చెబుతున్నారని, వాటిని తిప్పికొట్టడానికే వచ్చానని నెతన్యాహు అన్నారు.
ఇరానే మూలకారణం!
తన ప్రసంగంలో నెతన్యాహు ఇరాన్‌పై విరుచుకుపడ్డారు. "మీరు దాడి చేస్తే, మేమూ దాడి చేస్తాం" అంటూ ఆ దేశాన్ని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఇరాన్‌లోని ఏ ప్రాంతాన్నైనా లక్ష్యంగా చేసుకోగల సామర్థ్యం తమకుందన్నారు. ఆ దేశం అణ్వస్త్రాన్ని సముపార్జించుకోకుండా అడ్డుకుని తీరుతామని పేర్కొన్నారు. పశ్చిమాసియాలోని సమస్యలన్నింటికి ఇరాన్ మూలకారణమని ఆరోపించారు. చాలా కాలంగా యావత్ ప్రపంచం ఇరాన్‌ను బుజ్జగిస్తూ వస్తోందని, దానికి ముగింపు పలకాలని నెతన్యాహు పిలుపునిచ్చారు.
శుక్రవారం హూతీలు కూడా రెచ్చిపోయారు. టెల్ అవీవ్ లక్ష్యంగా యెమెన్ నుంచి మధ్యశ్రేణి హైపర్ సోనిక్ బాలిస్టిక్ క్షిపణి పాలస్తీనా-2ని ప్రయోగించారు. దీన్ని తాము యారో-3 రక్షణ వ్యవస్థతో అడ్డుకున్నామని ఐడీఎఫ్ తెలిపింది. డ్రోన్ దాడి కూడా చేశామని హూతీలు పేర్కొన్నారు. దీన్ని ఇజ్రాయెల్ ధ్రువీకరించలేదు.
ఎర్రసముద్రంలోనూ 3 అమెరికా యుద్ధనౌకలపై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసినట్లు హూతీలు ప్రకటించారు. తమ శత్రువైన ఇజ్రాయెల్‌కు మద్దతుగా వెళుతున్న ఈ నౌకలను అడ్డుకోవడానికి దాడులు చేశామని తెలిపారు. తమ నౌకలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని అమెరికా తెలిపింది. మధ్యమార్గంలోనే క్షిపణులను అడ్డుకున్నామని తెలిపింది.
700 దాటిన మృతుల సంఖ్య
మరోవైపు లెబనాన్‌లోని హెజ్‌బొల్లా ఉగ్ర సంస్థ ఇంకా ఇజ్రాయెల్‌పై రాకెట్లు ప్రయోగిస్తూనే ఉంది. హెజ్‌బొల్లా దాడిలో ఇజ్రాయెల్‌లో ఒకరికి గాయాలయ్యాయి. లెబనాన్ నుంచి వచ్చిన 4 డ్రోన్లను కూల్చివేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ వారం లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో దాదాపు 700 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
పూర్తి విజయం సాధించే వరకు పోరాటం- ఇప్పటికే 90% కంప్లీట్!: నెతన్యాహు - Israel Hamas War