Israel Hamas War : ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణకు అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాలు తెరవెనక జరుపుతున్న ప్రయత్నాలు కీలక దశకు చేరాయి. 40 రోజుల కాల్పుల విరమణ కోసం ఇజ్రాయెల్ ప్రతిపాదించినట్లు ఆయా దేశాలు తెలిపాయి. హమాస్ చెరలోని బందీల విషయంలోనూ టెల్ అవీవ్ కాస్త పట్టు సడలించింది. 40 మంది కంటే తక్కువ మందిని విడుదల చేసినా, ఒప్పందానికి తాము సిద్ధమేనన్న సంకేతం పంపింది. ప్రస్తుతం హమాస్ చెరలో 133 మంది బందీలు ఉన్నట్లు అంచనా. ఇందులో 30మంది మృతి చెందారనే అనుమానాలు ఉన్నాయి. బందీల విడుదలకు ప్రతిగా పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టనుంది ఇజ్రాయెల్. హమాస్ మాత్రం 40 రోజులు కాకుండా శాశ్వత కాల్పుల విరమణ కోరుకుంటోంది. తాజా ప్రతిపాదనకు హమాస్ అంగీకరిస్తుందన్న ఆశాభావాన్ని అమెరికా వ్యక్తంచేస్తోంది. కాల్పుల విరమణ అంశంపై ఆదివారం అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడారు. మరోవైపు కాల్పుల విరమణపై ప్రయత్నాలు జరుగుతున్నా ఇజ్రాయెల్ రఫాపై తన దాడులను ఆపలేదు. సోమవారం జరిపిన గగనతల దాడుల్లో ఆరుగురు మహిళలు, ఐదురుగురు చిన్నారులు సహా 22 మంది పాలస్తీనీయన్లు మృతి చెందారు.
విద్యార్థులపై చర్యలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న ఆందోళనలు ఫ్రాన్స్ రాజధాని పారిస్‌నూ తాకాయి. సోమవారం సర్బాన్ యూనివర్సిటీలో విద్యార్ధులు పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు చేపట్టారు. భారీ పాలస్తీనా జెండాతో 100కి పైగా విద్యార్థులు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమెరికాలోని పలు యూనివర్సిటీ ప్రాంగణాల్లో గుడారాలు వేసుకొని విద్యార్థులు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. మొదట న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో మొదలైన ఈ ఆందోళనలు అగ్రరాజ్యమంతా విస్తరించాయి. దాదాపు 900 మందికి పైగా విద్యార్థులను ఇప్పటివరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిని తీవ్రంగా వ్యవహరించిన కొలంబియా యూనివర్సిటీ విద్యార్థులను సస్పెన్షన్‌కు చర్యలు చేపట్టింది.
ఇజ్రాయెల్‌కు ఐసీసీ భయం
మరోవైపు కాల్పుల విరమణ చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ ఇజ్రాయెల్‌కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) భయం పట్టుకుంది. 2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఊహాగానాలపై ఐసీసీ నుంచి ఎటువంటి సూచనలు లేనప్పటికీ, విదేశాంగశాఖ మాత్రం ఇతర దేశాల్లోని తమ రాయబార కార్యాలయాలకు ఈమేరకు అలర్ట్ చేసింది. 2014 నాటి గాజా యుద్ధంలో ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్లు యుద్ధనేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అంతర్జాతీయ నేర న్యాయస్థానం మూడేళ్ల క్రితమే విచారణను చేపట్టింది. పాలస్తీనీయన్లు తమ భవిష్యత్తు దేశం కోసం కోరుతున్న భూభాగంలో ఇజ్రాయెల్ స్థావరాలను నిర్మించడం వంటి అంశాలనూ పరిగణనలోకి తీసుకుంది. అయితే ఈ కేసులో వారెంట్ల జారీపై ఇటీవల కాలంలో ఎటువంటి సూచనలు చేయలేదు. ఒకవేళ వారెంట్లు జారీ అయితే ఆ దేశ అధికారులను ఇతర దేశాల్లో అరెస్టుచేసే ప్రమాదం ఉంది. ప్రస్తుత గాజా యుద్ధంలో కూడా ఇజ్రాయెల్ నరమేధం జరిపిందా లేదా అన్న అంశంపైనా ఐసీసీ దర్యాప్తు చేపట్టింది.
అమెరికా యూనివర్సిటీల్లో ఆందోళనలు తీవ్రం! 550 మంది విద్యార్థులు అరెస్ట్- ఏం జరుగుతోంది? - US Universities Protests
యుద్ధం ముగించేందుకు హమాస్ డీల్- ఇజ్రాయెల్ ఒప్పుకుంటే ఆయుధాలు వదిలేస్తామని ప్రకటన! - Hamas Proposal For Ceasefire