Israel Attacks Lebanon : హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. లెబనాన్ రాజధాని బీరుట్‌పై క్షిపణులు ప్రయోగించడం వల్ల సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. వారం రోజులుగా కొనసాగుతున్న ఈ దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, 90 వేల మందికి పైగా నిరాశ్రయులుగా మారారని ఐక్యరాజ్య సమితి తాజాగా వెల్లడించింది.
లెబనాన్‌లో నెలకొన్న పరిస్థితులపై ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ వరుస దాడులతో ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది. వందలాది మంది మరణించగా, వేలాది మంది క్షతగాత్రులయ్యారు. ఇజ్రాయెల్ వరుస దాడులకు హెజ్‌బొల్లా కూడా ప్రతీకార ఘటనలకు దిగింది. టెలీ అవీవ్‌ను లక్ష్యంగా చేసుకుని క్షిపణులతో దాడి చేసింది. దీంతో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. అయితే ఈ క్షిపణిని అడ్డుకున్నామని, దీనికి సరైన బదులు చెబుతామని ఇజ్రాయెల్ దళాలు పేర్కొన్నాయి. కాగా, ఇటీవల లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్లు పెద్ద విధ్వంసమే సృష్టించాయి. ఈ ఘటనల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత బీరుట్‌పై ఇజ్రాయెల్ క్షిపణులు ప్రయోగించింది. ఇటీవల పేజర్ల పేలుళ్లు, వాకీటాకీల పేలుళ్లు, మరోవైపు హెజ్‌బొల్లా అగ్రశ్రేణి కమాండర్ల మరణంతో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి.
51 మంది మృతి
ఇదిలా ఉండగా బుధవారం లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగించింది. ఈ ఘనటలో 51 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 223 మందికి తీవ్రంగా గాయాలైనట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. గత రెండు రోజులతో కలిపి మొత్తంగా 564 మంది ప్రాణాలు కోల్పోగా, 1800 మందికి గాయాలైనట్లు వెల్లడించింది. మృతుల్లో 150 మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్లు పేర్కొంది.
లెబనాన్‌లో భూతల దాడులు
మరోవైపు ఇజ్రాయెల్ లెబనాన్‌లో భూతల దాడులకు సిద్ధవుతోంది. ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ ఈ మేరకు సన్నద్ధం కావాలని తమ బలగాలకు సూచించారు. హెజ్బొల్లా బలగాలు ప్రయోగించిన రాకెట్లు ఇజ్రాయెల్ భూభాగంలో చాలాదూరం వరకు వచ్చినట్లు తెలిపారు. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో ప్రాంతాల్లో పర్యటించిన ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ సరిహద్దుల్లో వైమానిక దాడులు చేసి ఐడీఎఫ్ బలగాలు లెబనాన్‌లోకి వెళ్లేందుకు మార్గం సుగమం చేస్తామన్నారు. హెజ్బొల్లా లక్ష్యంగా భూతల దాడులకు సిద్ధంగా ఉండాలని సేనలకు సూచించారు.
సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలి
ఈ పరిణామాల నేపథ్యంలో లెబనాన్‌లో ఉంటున్న తమ పౌరులను భారత్ అప్రమత్తం చేసింది. తక్షణం అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. లెబనాన్‌కు ఇపుడు ఎవరూ రాకూడదని స్పష్టంచేసింది.
Embassy of India in Beirut tweets, " as a reiteration of the advisory issued on 1 august 2024 and in view of the recent developments and escalations in the region, indian nationals are strongly advised against travelling to lebanon till further notice. all indian nationals already… pic.twitter.com/kpvhiuGN3N
— ANI (@ANI) September 25, 2024