Israel Airstrike On Rafah : రఫాపై దాడిని తక్షణం నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) ఆదేశాలు ఇచ్చినా, అమెరికా సహా ప్రపంచమంతా మొత్తుకుంటున్నా ఇజ్రాయెల్ ఖాతరు చేయడం లేదు. ఆదివారం రాత్రి రఫాపై చేసిన భీకర వైమానిక దాడిలో ఏకంగా 45 మంది పాలస్తీనా పౌరులు మృతిచెందారు. మరో 60 మంది గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో సగం మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్టు తెలుస్తోంది. దాడి జరిగిన తల్ అల్ సుల్తాన్ ప్రాంతాన్ని సురక్షిత ప్రాంతంగా ఇజ్రాయెల్ ప్రకటించింది. దీంతో ఉత్తర, మధ్య గాజా నుంచి కట్టుబట్టలతో తరలివచ్చిన పాలస్తీనియన్లు అక్కడ గుడారాలు వేసుకుని తలదాచుకుంటున్నారు. అలాంటి సురక్షిత ప్రాంతంపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది.
తప్పు చేశామని అంగీకరించిన ఇజ్రాయెల్
రఫాపై దాడి విషయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు విచారం వ్యక్తం చేశారు. తప్పు చేశామని పార్లమెంటులో అంగీకరించారు. సాధారణ పౌరులకు ఎలాంటి హాని చేయకూడదని అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ విషాద ఘటన జరిగిందన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని ప్రకటించారు. రఫాపై చేసిన దాడిని ఇజ్రాయెల్‌కు అత్యంత సన్నిహిత దేశాలైన అమెరికా, ఫ్రాన్స్ సహా స్పెయిన్ , ఇటలీ, ఐర్లాండ్, నార్వే, ఈజిప్టు, ఖతార్ తుర్కియే ఖండించాయి. అటు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ కూడా ఈ దాడిని తప్పుబట్టారు. ఈ ఘటన వల్ల అనేక మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారని, వెంటనే ఈ దాడులను ఆపాలని పేర్కొన్నారు.
ఈయూతో క్షీణిస్తున్న ఇజ్రాయెల్ సంబంధాలు
మరోవైపు ఐర్లాండ్, స్పెయిన్‌లు పాలస్తీనాను దౌత్యపరంగా గుర్తించేందుకు సిద్ధమైన వేళ ఇజ్రాయెల్, ఐరోపా సమాఖ్య(ఈయూ) మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయి. దక్షిణ గాజా నగరమైన రఫాలో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడులకు వ్యతిరేకంగా ఆంక్షలను విధించాలని స్పెయిన్ పట్టుబట్టడం వల్ల టెల్ అవీవ్‌తో ఈయూ సంబంధాలు మరింత క్షీణించాయి. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నట్లు ఇటీవల స్పెయిన్, ఐర్లాండ్‌తో పాటు ఈయూలో సభ్యదేశంగా లేని నార్వే ప్రకటించాయి. తమ నిర్ణయం మే 28 నుంచి అమలులోకి వస్తుందని ఇంతకుముందే తెలిపాయి. దీనికి చాలా వరకు దేశాలు మద్దతు ఇచ్చాయి.
అయితే పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించేందుకు కొన్ని పశ్చిమ దేశాలు మద్దతు ప్రకటించలేదు. దీంతో ఈ మూడు దేశాలు తీసుకున్న నిర్ణయం ఎంత వరకు అమలులోకి వస్తుందనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలోనే జెరూసలేంలో ఉన్న తమ కాన్సులేట్ పాలస్తీనియన్లకు సహాయం చేయడానికి ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ అనుమతించదని స్పెయిన్‌తో పేర్కొన్నారు. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించడం ద్వారా స్పెయిన్ ఉగ్రవాదానికి ప్రతిఫలం ఇస్తోందని ఆరోపించారు. కాట్జ్ వ్యాఖ్యలను స్పెయిన్ తప్పుబట్టింది.
'పనిష్మెంట్'ను మరింత పెంచిన చైనా- యుద్ధానికి సై అంటున్న తైవాన్! - China Taiwan Conflict