Iran Attack On Ship In Hormuz : ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో హార్ముజ్ జలసంధి సమీపంలో ఓ వాణిజ్య నౌకపై ఇరాన్ కమాండోలు హెలికాప్టర్ ద్వారా దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ నౌకలో 17 మంది భారతీయులు ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మరోవైపు పౌరుల క్షేమం, వారి విడుదల కోసం ఇరాన్ అధికారులతో భారత్ సంప్రదింపులు జరుపుతున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన ఇజ్రాయెల్, వివాదాన్ని తీవ్రతరం చేయడం వల్ల ఆ దేశం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
హార్ముజ్ జల సంధి సమీపంలో శనివారం ఓ ఓడపై హెలికాప్టర్ ద్వారా కమాండోలు దాడి చేసినట్లు వీడియోలు బయటకు వచ్చాయి. అయితే ఆ దాడి చేసింది ఇరాన్ అని మధ్య తూర్పు ఆసియా డిఫెన్స్ అధికారి తెలిపారు. ఆ హెలికాప్టర్ గతంలో ఇతర నౌకలపై దాడి చేసిన ఇరాన్ పారమిలిటరీ రివల్యూషనరీ గార్డ ఉపయోగించినదిగా వీడియో కనిపించిదని అన్నారు. అయితే ఆ కార్గో షిఫ్‌ను కమాండోలు స్వాధీనం చేసుకున్నట్లు ఇరాన్ మీడియా తెలిపింది. అంతకుముందు బ్రిటన్‌కు చెందిన యూకే మారిటైమ్ ఏజెన్సీ కూడా నౌక సీజ్ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం దాన్ని ఇరాన్ ప్రాదేశిక జలాల వైపు మళ్లించిట్లు సమాచారం. పోర్చుగల్ జెండాతో ఉన్న ఆ వాణిజ్య నౌకను ఇజ్రాయెల్ కుబేరుడు ఇయాల్ ఒఫర్ జోడియాక్ సంస్థకు చెందిన ఎంఎస్‌సీ ఏరిస్‌గా భావిస్తున్నారు.
ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు
మరోవైపు ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఏ క్షణమైనా దాడి చేస్తుందన్న సంకేతాలు పశ్చిమాసియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రానున్న 24 నుంచి 48 గంటల్లోపు దాదాపు 100కు పైగా డ్రోన్లు, 150కి పైగా క్షిపణులతో టెల్ అవీవ్‌పై విరుచుకుపడేందుకు టెహ్రాన్ సిద్ధమైందని అమెరికా నిఘా వర్గాలు ఇప్పటికే తెలిపాయి. దీంతో ఏక్షణం ఏం జరుగుతుందోననే పశ్చిమాసియాలో ఆందోళన నెలకొంది. ఇరాన్ నుంచి ఎలాంటి దాడినైనా ఎదుర్కొవడానికి పూర్తిస్థాయిలో సన్నద్ధమైనట్లు ఇజ్రాయెల్ కూడా ప్రకటించింది.
ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌కు అమెరికా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేసే ప్రమాదం ఉందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అంచనా వేశారు. తాను రహస్య సమాచారం జోలికి వెళ్లటం లేదన్న ఆయన దాడికి ఎంతో సమయం లేదని భావిస్తున్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్ రక్షణకు అమెరికా కట్టుబడి ఉందన్న బైడెన్ దాడి చేయొద్దంటూ ఒక్కపదంతో టెహరాన్‌కు సందేశం పంపారు. ఇజ్రాయెల్ తోపాటు తమ బలగాల రక్షణ కోసం విధ్వంసక నౌకలను, అదనపు సైనిక సామగ్రిని పశ్చిమాసియాకు తరలిస్తున్నట్టు బైడెన్ చెప్పారు. ఒకవైపు సైనిక సన్నద్ధత ఏర్పాట్లలో నిమగ్నం కావటం, మరోవైపు ఉద్రిక్తతల నివారణకు దౌత్య ప్రయత్నాలు కూడా అమెరికా తీవ్రతరం చేసింది.
మరోవైపు ఇజ్రాయెల్ ఫిరంగిదళంపై క్షిపణి దాడులు చేసినట్లు ఇరాన్ మద్దతు ఉన్న హెజ్ బొల్లా మిలిటెంట్ గ్రూప్ ప్రకటించింది. దక్షిణ లెబనాన్‌లోని ఆగ్రూప్ స్థావరాలపై ఇటీవల నెతన్యాహు సేనలు జరిపిన దాడులపై ప్రతీకారచర్యకు దిగినట్లు హెజ్ బొల్లా తెలిపింది. ఇటీవల సిరియాలోని ఇరాన్ కాన్సులేట్ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఆ దాడిలో ఇరాన్ టాప్ కమాండర్లు సహా ఏడుగురు సైనికులు చనిపోయారు. అప్పటి నుంచి ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది.
వేరే మార్గాల ద్వారా మళ్లింపు
ఇదిలా ఉండగా ఎయిర్ఇండియా ఓ కీలక నిర్ణయిం తీసుకుంది. ఇరాన్ గగనతలం నుంచి విమాన రాకపోకలను తాత్కాకంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సంబంధితవర్గాలు తెలిపాయి. ఐరోపా దేశాలకు వెళ్లే విమానాలు ఇరాన్ గగనతలం నుంచి కాకుండా వేరేమార్గంలో మళ్లించినట్లు వెల్లడించాయి. శనివారం ఉదయం లండన్‌కు బయల్దేరిన విమానం ఇరాన్ మీదుగా కాకుండా మరోమార్గంలో వెళ్లినట్లు సమాచారం. దీంతో ఐరోపా దేశాలకు చేరుకోవడానికి ప్రయాణ సమయం రెండు గంటలు పెరగనుంది.
పాకిస్థాన్‌లో రెచ్చిపోయిన ముష్కరులు- 11మందిని చంపిన మిలిటెంట్లు - Pakistan Militants Killed People