Indian Americans in US Economy : అమెరికా జనాభాలో 1.5 శాతమే ఉన్న భారత సంతతివారి వల్ల ఆ దేశార్థికానికి మేలు జరుగుతుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అధ్యయనం పేర్కొంది. భారతీయ సంతతి నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎక్కువగా ఉందని తెలిపింది. మొత్తం ఆదాయ పన్నులో భారతీయ అమెరికన్ల నుంచి సుమారు 5-6 శాతం వస్తోందని నివేదికలో చెప్పింది.
16 కంపెనీలకు భారతీయ సంతతి వారే సీఈఓలు
'2023 నాటికి భారతీయ అమెరికన్ల జనాభా సుమారు 50లక్షలకు చేరింది. అంటే అమెరికా జనాభాలో 1.5 శాతం ఉన్నారు. వారి నుంచి ప్రభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయ పన్నులో 5-6 శాతం లభిస్తోంది. దాదాపు 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల డాలర్లకు సమానం అవుతుంది. భారతీయ అమెరికన్ల వృత్తుల వల్ల అమెరికాలో కోటీ పది లక్షల నుంచి కోటీ ఇరవై లక్షల మందికి పరోక్ష ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 16 సంస్థలకు భారతీయ అమెరికాన్ల వారే ప్రధాన కార్యనిర్వహణాధికారులుగా ఉన్నారు. వారిలో సుందర్ పిచాయ్ (గూగుల్), సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్) తదితరులున్నారు. ఈ కంపెనీల వల్ల 27లక్షల మంది అమెరికన్లకు ఉద్యోగాలు లభిస్తున్నాయి. దేశానికి లక్ష కోట్ల డాలర్ల ఆదాయం సమకూరుతోంది' అని అధ్యయనంలో వెల్లడించింది.
55 వేల మందికి ఉపాధి
ఇక అమెరికాలోని 648 యూనికార్న్‌లలో 72సంస్థల సహ వ్యవస్థాపకులు భారతీయులే ఉన్నారని పేర్కొంది. 'వాటి వల్ల 55,000 మందికి ఉపాధి లభిస్తుంది. అమెరికాలో 60 శాతం హోటళ్లు భారతీయ అమెరికన్లు నడుపుతున్నారు. 1975లో అమెరికాలోని భారతీయులు 2 శాతం పేటెంట్లకు దరఖాస్తు చేయగా, అవి 2019 నాటికి అవి 10 శాతానికి పెరిగాయి. 2023లో భారత సంతతి శాస్త్రవేత్తలు 11 శాతం జాతీయ ఆరోగ్య సంస్థ గ్రాంట్లను పొందారు. 13 శాతం శాస్త్ర పరిశోధన పత్రాలను ప్రచురించారు. అమెరికా కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో 22,000 మంది భారతీయ అధ్యాపకులు బోధిస్తున్నారు. వారిలో డాక్టర్ నీలి బెండపూడి పెన్ స్టేట్ విశ్వవిద్యాలయానికి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు అయ్యారు' అని నివేదిక తెలిపింది.
ఇజ్రాయెల్‌కు భారీ షాక్- ఆర్మీ కాన్వాయ్‌పై హమాస్ దాడి- 8మంది సైనికులు మృతి
మళ్లీ 'మెలోడీ' ట్రెండింగ్- మోదీ, మెలోనీ సెల్ఫీ వీడియో చూశారా? - G7 summit 2024