Imran Khan Jail Sentence Suspended : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఊరట లభించింది. తోషాఖానా అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ దంపతులను దోషిగా తేల్చి, విధించిన 14 ఏళ్ల జైలు శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ కేసులో విధించిన 14 ఏళ్ల శిక్షను ఇమ్రాన్ ఖాన్ దంపతులు పాకిస్థాన్ హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పాకిస్థానీ హైకోర్టు చీఫ్ జస్టిస్ అమర్ ఫరూఖ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఆ శిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తూ బెయిల్‌ను మంజూరు చేసింది. అలాగే జైలు శిక్షకు సంబంధించి వచ్చిన అప్పీళ్లను రంజాన్ తర్వాత విచారిస్తామని పేర్కొంది అయితే ఇమ్రాన్ ఖాన్ దంపతులు వేరే కేసుల్లో కూడా దోషులుగా ఉన్నందు వల్ల జైలు నుంచి విడుదల కాకపోవచ్చు అని తెలుస్తోంది. ఇమ్రాన్ దంపతులకు 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ జనవరి 31న పాకిస్థాన్ కోర్టు తీర్పును వెల్లడించింది.
కేసు ఏంటంటే?
ఇమ్రాన్ ప్రధానిగా ఉన్న సమయంలో దాదాపు 58 ఖరీదైన కానుకలు అందుకున్నారు. వాస్తవానికి వీటిని తోషాఖానాలో జమ చేయాలి. ఇక వాటిని సొంతం చేసుకోవాలనుకుంటే నిబంధనల ప్రకారం సగం ధర చెల్లించి తీసుకోవాలి. కానీ, ఇందులో రూ.38 లక్షల రోలెక్స్ గడియారాన్ని ఇమ్రాన్ కేవలం రూ.7.54 లక్షలు (పాకిస్థాన్ రూపాయి) చెల్లించి సొంతం చేసుకున్నారు. రూ.15 లక్షలు విలువ చేసే మరో రోలెక్స్ గడియారాన్ని రూ.2.94 లక్షలు మాత్రమే చెల్లించి తీసుకున్నారు. ఇలా మూడోవంతు కంటే తక్కువగా ధర కట్టి, పలు కానుకలను ఇమ్రాన్ తన ఇంటికి చేర్చుకున్నారని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపించారు. అలాగే రూ.8లక్షల కానుకలను ఒక్క రూపాయి కూడా ఖజానాకు జమ చేయకుండానే తీసుకున్నారని, ఆ తర్వాత వాటిని దుబాయిలో అమ్ముకున్నారని ఆరోపించారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ ఈ వ్యవహారంపై విచారణ జరిపింది. గ్రాఫ్ చేతి గడియారం, కఫ్లింక్స్, ఖరీదైన పెన్, ఉంగరం, నాలుగు రోలెక్స్ వాచ్‌లు సహా మరికొన్ని కానుకల్ని మొత్తం రూ.2కోట్ల 15 లక్షల 60వేలకు తోషాఖానా నుంచి కొనుగోలు చేసినట్లు పాక్ ఎన్నికల సంఘానికి విచారణ సమయంలో తెలిపారు ఇమ్రాన్. వాటిని విక్రయిస్తే రూ.5కోట్ల 80లక్షలు వచ్చినట్లు వెల్లడించారు. అయితే ఈ ఆదాయం వివరాల్ని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నుల్లో చూపలేదు. ఫలితంగా ఇమ్రాన్ ఖాన్‌పై పాకిస్థాన్ ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. ఈ కేసులో ఇస్లామాబాద్‌లోని జిల్లా, సెషన్స్ కోర్టు ఆగస్టు 5న ఇమ్రాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. ఆ తర్వాత కోర్టు తీర్పును సస్పెండ్ చేసింది. జనవరిలో పాకిస్థాన్ కోర్టు ఏకంగా 14 ఏళ్లు జైలు శిక్ష విధించింది. తాజాగా ఈ శిక్ష సస్పెండ్ చేసింది.