India To Assist ASEAN In DPI : యూపీఐ, ఆధార్ లాంటి డిజిటల్ మౌలిక సదుపాయాల (డీపీఐ) వినియోగంలో తనకున్న విజ్ఞానాన్ని, అనుభవాలను ఆసియాన్ దేశాలతో భారత్ పంచుకోనుంది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, వాతావరణ మార్పుల విషయంలో ఎదురయ్యే పలు సమస్యల పరిష్కారానికి సహకారం అందించనుంది. ఈ విషయాన్ని గురువారం ఒక సంయుక్త ప్రకటనలో ఏసియాన్ దేశాలు తెలిపాయి. లావోస్ రాజధాని వియాంటియాన్‌లో జరిగిన 21వ భారత్-ఆసియాన్ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. సదస్సు అనంతరం ఈ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, సమగ్రతల కోసం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడంపైనా ఇరువర్గాలు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. భవిష్యత్తులో పరస్పర సహకారానికి ఈ భాగస్వామ్యం పునాది వేస్తుందని సదస్సు ముగింపు సందర్భంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆసియాన్ దేశాల్లో ఇండొనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్, కాంబోడియా మొదలైన పది దేశాలున్నాయి.
‘అంతర్జాతీయ చట్టాలను చైనా గౌరవించాలి’
దక్షిణ చైనా సముద్రంపై తరచూ వివాదాలు తలెత్తుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలంటూ ఆగ్నేయాసియా దేశాల నేతలు చైనాకు సూచించారు. అయితే దీనిపై చైనా ప్రధానమంత్రి లీ కియాంగ్ స్పందిస్తూ, ప్రాంతీయ వ్యవహారాల్లో 'బాహ్యశక్తులు' జోక్యం చేసుకుంటున్నాయని విమర్శించారు. మరోవైపు ఆసియాన్ దేశాలతో లోతైన మార్కెట్ ఏకీకరణను కోరుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆసియాన్ దేశాలు, చైనా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు తుదిదశకు చేరుకున్నాయని సంబంధిత నేతలు వెల్లడించారు.
జపాన్, న్యూజిలాండ్ ప్రధానులతో మోదీ చర్చలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం లావోస్ రాజధాని వియంటయాన్‌లో జపాన్ ప్రధాని శిగేరు ఇషిబాతోనూ, న్యూజిలాండ్ పీఎం క్రిష్టోఫర్ లుక్సాన్‌తోనూ చర్చలు జరిపారు. మౌలికసదుపాయాలు, అనుసంధానత, రక్షణ సహా పలు రంగాల్లో పరస్పర సహకారం పెంపు మొదలైన అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. 21వ ఆసియాన్-భారత్ సదస్సు నేపథ్యంలో లావోస్ చేరుకున్న మోదీ ఇక్కడ పలు ఇతర దేశాల నేతలతోనూ భేటీ కానున్నారు.