Gaza Death Toll : ఇజ్రాయెల్ సైన్యం వైమానిక, భూతల దాడులతో గాజాపై విరుచుకుపడింది. ఇజ్రాయెల్ దళాల దాడుల్లో గత 24 గంటల్లో దక్షిణ, మధ్య గాజా ప్రాంతాల్లోని నగరాల్లో 71 మంది పౌరులు మరణించారు. మృతుల్లో సగం మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. వందలాది మంది గాయపడ్డారని, చాలామంది పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంది. దీంతో మృతుల సంఖ్య 29,000కు చెరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
వెస్ట్ బ్యాంకులో ఉద్రిక్తత
మరోవైపు వెస్ట్ బ్యాంకులోనూ పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. గురువారం ఉదయం ఓ చెక్ పాయింట్ దగ్గర ముగ్గురు పాలస్తీనీయన్లు జరిపిన కాల్పుల్లో ఇజ్రాయెల్ పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో ఐదుగురు గాయపడ్డారని ఇజ్రాయెల్ పోలీసులు తెలిపారు. అయితే ఇజ్రాయెల్ పోలీసుల కాల్పుల్లో దాడిచేసిన వారిలో ఇద్దరు చనిపోయారని, ఆ తర్వాత మూడో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.
రఫాపై ఇజ్రాయెల్ దాడి
ఇక క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆస్పత్రులు మార్మోగుతున్నాయి. వైద్య సిబ్బంది, ఔషధాలు లేక దెయిర్ అల్ బలాహ్ ఆస్పత్రి నరకాన్ని తలపిస్తోంది. ఉత్తరగాజాలో యుద్ధం ముగిసినట్లు ప్రకటించిన వేళ నెతన్యాహూ సేనలు ఇప్పుడు దక్షిణ మధ్య ప్రాంతాలను లక్ష్యం చేసుకుంటున్నాయి. 15 లక్షల మంది ఉన్న రఫా నగరాన్ని ఇజ్రాయెల్ బలగాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. హమాస్ తమ దగ్గరున్న బందీలను విడుదల చేయకపోతే మరింత బీభత్సం తప్పదని ఇజ్రాయెల్ వార్ క్యాబినేట్ సభ్యుడు హెచ్చరించారు.
ప్రాణాలు కోల్పోయిన నాలుగోవంతు మంది
గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్ దాదాపు 250 మందిని బంధించింది. ఆ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా వీరిలో కొంతమందిని విడుదల చేశారు. ఇంకా 136 మంది హమాస్ చెరలో ఉండగా వీరిలో ఇద్దరిని ఇజ్రాయెల్ కాపాడింది. అయితే, బందీల్లో నాలుగోవంతు మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని ఆరోగ్య శాఖ భావిస్తోంది. ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న గాజా భూభాగంలోని 2.3 మిలియన్ల మందిలో 80 శాతం పౌరులు వారి ఇళ్లను ఖాళీ చేశారు. వారిలో దాదాపు 1.5 మిలియన్ల మంది ఈజిప్టు సరిహద్దుకు సమీపంలో ఉన్న రఫాకు వెళ్లారని ఆరోగ్య శాఖ తెలిపింది.
రఫాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- 67 మంది దుర్మరణం- మృతుల్లో చిన్నారులు కూడా!
135 రోజులపాటు కాల్పుల విరమణ ప్రతిపాదన- తగ్గేదేలే అన్న నెతన్యాహు