South Korea Defence Minister : దక్షిణ కొరియాలో మరో కీలక పరిణామం జరిగింది. ఆ దేశ మాజీ రక్షణ మంత్రి కిమ్ యోంగ్ హ్యూన్‌ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఇటీవల ప్రకటించిన 'ఎమర్జెన్సీ మార్షల్ లా' నేపథ్యంలో మాజీ రక్షణ మంత్రి పాత్ర ఉందనే ఆనుమానంతో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
మార్షల్ లా ప్రకటన నేపథ్యంలో అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, కిమ్ యోంగ్ హ్యూన్‌ను పదవుల నుంచి తప్పించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలోనే హ్యూన్‌ను పదవి నుంచి తప్పిస్తున్నట్లు దేశ అధ్యక్షుడు ప్రకటించారు. ఆయన స్థానంలో చోయ్ బ్యూంగ్ హ్యూక్‌ను నియమించారు. తన ఆదేశాల మేరకే సైన్యం నడుచుకుందని, రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు హ్యూన్ తెలిపారు.
ఈ క్రమంలోనే ఆయన్ను అరెస్టు చేసినట్లు సమాచారం. మరోవైపు సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ ప్రాసిక్యూటర్స్ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరైనట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.
ఆయన పదవి సేఫ్
అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ 'ఎమర్జెన్సీ లా' ప్రకటించినందుకు ప్రతిపక్షాలు ఆయనపై అభిశంసన తీర్మాణం ప్రవేశపెట్టాయి. దీంతో ఆయన పదవి పోవడం ఖాయమని వార్తలు వచ్చాయి. అయితే పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు ప్రవేశ పెట్టిన అభిశంసన తీర్మానం వీగిపోయింది. అధికార పీపుల్ పవర్' పార్టీకి చెందిన సభ్యులు ఓటింగ్‌ను బహిష్కరించటం వల్ల అంభిశంసన తీర్మానం వీగిపోయినట్లు స్పీకర్ ప్రకటించారు.
ఏం జరిగిందంటే
ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ యూన్ సుక్ యోల్ ఇటీవల 'ఎమర్జెన్సీ మార్షల్ లా' విధించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడం వల్ల పార్లమెంట్‌లో ఓటింగ్ పెట్టి అత్యవసర స్థితికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించారు. గంటల వ్యవధిలోనే ఎమర్జెన్సీని ఎత్తివేశారు. ఈ నిర్ణయంతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించినందుకు తనను క్షమించాలంటూ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కోరారు. ఇటువంటి తప్పు మరోసారి చేయనని ఆయన వెల్లడించారు.
దక్షిణ కొరియా అధ్యక్షుడికి తప్పిన పదవీ గండం - ఓటింగ్‌కు దూరంగా అధికార పార్టీ