Elon Musk Interview With Trump : అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. అటు అధ్యక్ష అభ్యర్థుల ప్రచారం కూడా మరింత జోరందుకుంది. తాజాగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను టెస్లా, స్పేస్‌ఎక్స్ సంస్థల అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ చేశారు. ఈ కార్యక్రమంలో డెమోక్రాట్లపై విమర్శల దగ్గర్నుంచి అమెరికా ప్రత్యర్థి దేశాలపై పొగడ్తల వరకు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు డొనాల్డ్ ట్రంప్.
బైడెన్‌ను ఘోరంగా ఓడించా
'ఇటీవల నేను బైడెన్‌తో ఓ డిబేట్‌లో పాల్గొన్నాం. అది నా గొప్ప చర్చల్లో ఒకటిగా భావిస్తున్నా. ఆ డిబేట్‌లో ఆయనను ఘోరంగా ఓడించా. ఫలితంగా ఆయనను అధ్యక్ష రేసు నుంచి పంపించేశారు. డెమొక్రటిక్ పార్టీలో మొదలైన తిరుగుబాటు కారణంగానే బైడెన్ వైదొలగాల్సి వచ్చింది' అని ట్రంప్ విమర్శించారు.
వాళ్లే టాప్‌లో ఉన్నారు!
'వ్లాదిమిర్ పుతిన్ (రష్యా అధ్యక్షుడు), షీ జిన్‌పింగ్ (చైనా అధినేత), కిమ్ జోంగ్ ఉన్ (ఉత్తరకొరియా అధ్యక్షుడు) వారు తమ ఆటల్లో మొదటి స్థానంలో ఉన్నారు. వారంతా తమ దేశాలను ప్రేమిస్తున్నారు. అయితే, వారిది భిన్నమైన ప్రేమ. వాళ్లని ఎదుర్కోవడానికి అమెరికాకు బలమైన అధ్యక్షుడు కావాలి. అధ్యక్షుడిగా బైడెన్ లేకపోయి ఉంటే, ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసేది కాదు. పుతిన్‌తో నేను చాలా సార్లు మాట్లాడా. ఆయన నాకు చాలా గౌరవమిస్తారు. ఉక్రెయిన్ గురించి కూడా మేము చర్చించుకున్నాం' అని ట్రంప్ చెప్పారు.
ఆమె గెలిస్తే వినాశనమే!
ఈ సందర్భంగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 'ప్రస్తుతం మనకు అధ్యక్షుడు ఉన్నా లేనట్లే. కమలా హారిస్ వస్తే పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ఆమె గెలిస్తే మన దేశాన్ని నాశనం చేస్తుంది. ఇక అధికారంలోకి వస్తే 50-60 మిలియన్ల అక్రమ వలసదారులు దేశంలోకి ప్రవేశిస్తారు. వారంతా అతివాద భావజాలంతో ఉంటారు. నేరాలకు పాల్పడే అవకాశం ఉంది. నేను అధికారంలోకి వస్తే వలస చట్టాలను మరింత కఠినంగా అమలు చేస్తా. చరిత్రలోనే ఎన్నడూ చూడని విధంగా బహిష్కరణ ప్రక్రియను చేపడతా. అమెరికాన్ల కలలను నేరవేర్చి ఉద్యోగాలను సృష్టిస్తా' అని ట్రంప్ హామీ ఇచ్చారు.
'దేవునిపై నమ్మకం పెరిగింది'
ఇటీవల పెన్సిల్వేనియాలో తనపై జరిగిన కాల్పుల ఘటన గురించి మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. 'అది బుల్లెట్ అని, నా చెవి మీదకు దూసుకొచ్చిందని క్షణకాలానికే అర్థమైంది. ఆ సమయంలో సరిగ్గా నేను తల తిప్పడం వల్లే ప్రాణాలతో బయటపడ్డా. విధి అంటే ఇదేనేమో. ఆ ఘటన తర్వాత నుంచే నేను దేవుడిని మరింత ఎక్కువగా నమ్ముతున్న' అని మస్క్‌తో ట్రంప్ అన్నారు.
మళ్లీ ఎక్స్‌లోకి ట్రంప్
ఎక్స్‌లో ప్రసారమైన ఈ లైవ్ ఇంటర్వ్యూకు తొలుత సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఆ తర్వాత కూడా చాలా మంది వినియోగదారులకు ఇంటర్వ్యూ ఆడియో వినిపించలేదు. ఇందుకు డీడీఓఎస్ అటాక్ కారణమని మస్క్ తెలిపారు. అయినప్పటికీ 2.7 కోట్ల మంది వీరి సంభాషణను విన్నారు. ఈ మాజీ అధ్యక్షుడు మళ్లీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లోకి అడుగుపెట్టారు. చివరిసారిగా 25 ఆగస్టు 2023లో పోస్టు పెట్టిన ట్రంప్, మస్క్‌తో సంభాషణ నేపథ్యంలో మళ్లీ వరుసగా పోస్ట్‌లు పెట్టారు. గతంలో క్యాపిటల్ భవనంపై దాడిని ప్రేరేపించిన కారణంతో ఎక్స్ (అప్పటి ట్విటర్) నుంచి ఆయనను నిషేధించారు. ఈ మాధ్యమాన్ని మస్క్ కొనుగోలు చేసిన తర్వాత ట్రంప్‌పై నిషేధాన్ని తొలగించారు.
There appears to be a massive DDOS attack on 𝕏. Working on shutting it down.
— Elon Musk (@elonmusk) August 13, 2024
Worst case, we will proceed with a smaller number of live listeners and post the conversation later.
'ఎలాన్ మస్క్ నన్ను ఇంటర్వ్యూ చేయనున్నారు' - డొనాల్డ్ ట్రంప్ - Elon Musk To Interview Trump
కమలతో చర్చకు ట్రంప్ రె'ఢీ'- సెప్టెంబరు 10న మరో వాడీవేడీ డిబేట్! - Trump Harris Debate