Eiffel Tower Closed Due To Strike : ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఈఫిల్ టవర్ ఒకటి. సాధారణంగా ఇది 365 రోజులు తెరిచే ఉంటుంది. అలాంటి ఈఫిల్ టవర్ సోమవారం మూతపడింది. పేలవమైన ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు సమ్మెకు దిగడం వల్ల ఈఫీల్ టవర్‌ను అధికారులు మూసివేశారు. ఈ కారణంగా సోమవారం వచ్చిన సందర్శకులను వెనక్కి పంపారు. ఈ చర్య పర్యటకులను తీవ్ర నిరాశకు గురిచేసింది. CGT యూనియన్‌కు చెందిన ఉద్యోగులు ఈఫీల్ టవర్ నిర్వహణ బాధ్యతలు చూస్తారు. ఈఫిల్ టవర్ టికెట్ల నుంచి వచ్చే ఆదాయంకు అనుగుణంగా తమ జీతాలు పెరగాలని CGT ఉద్యోగులు సమ్మెలో దిగారు.
ప్రపంచ ప్రముఖ ప్రాంతాల్లో ఒకటైన ఈ లోహ కట్టడం ప్రవేశ ద్వారం వద్ద ఈఫిల్ టవర్ ఉద్యోగుల సమ్మె కారణంగా మూసివేశామని, దీనికి తమను మన్నించమని బోర్టు పెట్టారు. ఆలాగే అధికారిక వెబ్‌సైట్‌లో పలు భాషల్లో ఈ విషయాన్ని అధికారులు తెలియజేశారు. త్వరలో జరగనున్న 2024 సమ్మర్ ఒలంపిక్స్‌కు పారిస్ వేదిక కానుండటం వల్ల పర్యటకులు భారీగా ఈఫిల్ టవర్ సందర్శనకు ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో ఈఫిల్ టవర్ మూసివేయడం వల్ల పర్యటకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. 15 సంవత్సరాల తర్వాత పిల్లలతో సహా తాను ఈ 300 మీటర్ల అద్భుత కట్టడాన్ని సందర్శించడానకి వచ్చామని కెనడా నుంచి వచ్చిన పర్యటకుడు శాంటోస్ తెలిపారు. కానీ ఈఫిల్ టవర్ మూసివేయడం తమను తీవ్ర నిరాశకు గురి చేసిందని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈఫిల్ టవర్‌ను 1887 జనవరిలో మొదలుపెట్టి 1889 మార్చి 31వ తేదీ నాటికి నిర్మాణం పూర్తి చేశారు. ప్రారంభ ఏడాదిలో 20 లక్షల మంది సందర్శకులు ఈఫిల్ టవర్‌ను సందర్శించారు. అయితే ఈ అద్భుత నిర్మాణాన్ని చూసేందుకు ప్రతి ఏటా దేశ విదేశాల నుంచి లక్షలాది మంది పర్యటకులు వస్తుంటారు. గతేడాది 62 లక్షల మంది ఈ కట్టడాన్ని సందర్శించినట్లు రికార్డులు చెబుతున్నాయి.