Does Earth Rotation Speed Change : భూమి తన చూట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టు కూడా తిరుగుతుందని మనకు తెలుసు. అయితే గత కొంత కాలంగా ఆ వేగం గణనీయంగా తగ్గుతోందా? అవుననే అంటున్నారు నిపుణులు. రోజు పరిమాణం ప్రతి వందేళ్లకు 1.8 సెకన్లు పెరుగుతోందట. ఇది ఇలాగే కొనసాగితే 2100 నాటికి, రోజుకు మరో 2.2 మిల్లీసెకన్లు పెరిగే అవకాశం ఉంది.
రోజుకు ఎన్ని గంటలు అంటే- ప్రస్తుతం సమాధానం 24 గంటలు. ఈ సమయం అనేది భూమి తన అక్షంపై ఒక భ్రమణాన్ని పూర్తి చేయడానికి ఎంత సమయం తీసుకుంటుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. అయితే ఈ వేగాన్ని చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. 1.4 బిలియన్ సంవత్సరాల క్రితం రోజుకు 19 గంటలు ఉండగా ఇప్పుడు రోజుకు 24 గంటల వరకు పెరిగింది.
వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా ధ్రువాల వద్ద మంచు కరుగుతోంది. దీనివల్ల భూమి భ్రమణం మందగిస్తున్నట్లు చెబుతున్నారు. భూమికి మూడు పొరలు ఉన్నవిషయం మనకు తెలిసిందే. మొదటి, పై పొరను క్రస్ట్ అంటారు. దీనిపైనే మనం ఉన్నామన్నమాట. దీని తర్వాత అంటే దిగువ పొర లోహం. మూడో, లోపలి పొరను కోర్ అంటారు. ఇప్పుడు లోపల ఉండే కోర్ పొర భ్రమణం మందగిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే భూమి లోపలి కోర్, భూఉపరితలం కంటే చాలా నెమ్మదిగా తిరుగుతోంది.
భవిష్యత్తులో రోజుకు ఎన్ని గంటలు అని ప్రశ్న అడిగితే!
భూమి భ్రమణం మందగించడం వల్ల మన రోజు సమయం పెరుగుతుంది. రోజు నిడివి కాస్త పెరగడం వల్ల పెద్ద మార్పు కనిపించకపోవచ్చు. కానీ క్రమంగా ఈ మార్పులు పెరిగితే- తేడా స్పష్టంగా తెలుస్తుంది. 2010లో చిలీలో సంభవించిన భూకంపం గ్రహం భ్రమణాన్ని వేగవంతం చేసింది. రోజును 1.26 మైక్రో సెకన్లు తగ్గించింది. ఒక్క మాటలో చెప్పాలంటే భవిష్యత్తులో రోజుకు ఎన్ని గంటలు అని ప్రశ్న అడిగితే 25 గంటలు అనే సమాధానం కూడా రైట్ ఆన్సర్ అవ్వబోతుందన్నమాట!