Double Murder Evidence Memory Card : అమెరికాలోని యాంకరేజ్‌లో నాలుగేళ్ల క్రితం వాహనంలో ఓ మహిళ దొంగతనం చేసిన మెమొరీ కార్డు ఆధారంగా జంట హత్యల ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ కార్డులోని దృశ్యాలను పరిశీలించి రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అసలు అప్పుడు ఏం జరిగిందంటే?
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం- చోరీ, దాడులకు పాల్పడడం, వ్యభిచారం వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న ఓ మహిళ మరో వ్యక్తితో ట్రక్కులో డేట్‌కు వెళ్లింది. వాహనంలో ఒంటరిగా ఉన్న సమయంలో అందులో ఉన్న మెమొరీ కార్డును దొంగతనం చేసింది. అయితే ఆ విషయాన్ని నాలుగేళ్లపాటు మరిచిపోయింది. తాజాగా ఆ కార్డులోని దృశ్యాలను చూసింది. హత్యకు సంబంధించిన దారుణమైన ఫొటోలు, వీడియోలు కనిపించాయి. వెంటనే ఆ కార్డును మహిళ పోలీసులకు అప్పగించింది.
అయితే మహిళను దారుణంగా కొట్టి గొంతుకోసిన వ్యక్తి, చనిపోవాల్సిందిగా గట్టిగా అరవడం వంటి దృశ్యాలు ఆ మెమొరీ కార్డులో ఉన్నట్లు స్థానిక పోలీసులు గుర్తించారు. ఆ దృశ్యాలతోపాటు దుప్పట్లో చుట్టిన బాధితురాలి మృతదేహం బయట లగేజ్ కార్ట్ వద్ద పడేసి ఉండడాన్ని కూడా చూశారు. ఆ దృశ్యాల్లోని గొంతు బ్రియన్ స్టీవెన్ స్మిత్ (52) అనే వ్యక్తిదిగా అధికారులు గుర్తించారు.
అలస్కాకు చెందిన మహిళలు కాథ్లీన్ హెన్రీ (30), వెరోనికా అబౌచుక్ (52)ల హత్యలు సహా మొత్తం 14 అభియోగాల్లో దోషిని కాదంటూ గతంలో స్మిత్ వాదించాడు. అయితే హెన్రీ హత్య యాంకరేజ్‌లోని టౌన్‌ప్లేస్ సూట్స్ హోటల్‌లో జరిగినట్లు రికార్డయింది. 2019 సెప్టెంబరు రెండో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు ఆ హోటల్‌లో ఉండేందుకు స్మిత్ బుక్ చేసుకున్నాడు.
అయితే ఎస్డీ కార్డులో నమోదైన హెన్రీ హత్య దృశ్యాలకు సంబంధించి దర్యాప్తు అధికారులు స్మిత్‌ను విచారించారు. ఈ క్రమంలో అతడు వెరోనికా హత్యకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించాడు. ఈ హత్యలకు సంబంధించిన పూర్తి విచారణ సోమవారం నుంచి మొదలవుతుంది. ఈ విచారణ మూడు నుంచి నాలుగు వారాలపాటు కొనసాగుతుందని అధికారులు భావిస్తున్నారు.