Trump Vs Harris : నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య ఉత్కంఠభరితమైన పోటీ నెలకొంది. సర్వేల్లో ఈ డొనాల్డ్ ట్రంప్, కమల హారిస్‌లకు వచ్చే ఓట్లలో పెద్దగా తేడా ఉండటం లేదు. దీంతో ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచి, అధ్యక్ష పీఠంపై కూర్చుంటారో అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఓ పోల్‌లో కమల హారిస్ కంటే ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఇజ్రాయెల్-హమాస్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాలను డీల్ చేయడంలో డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ కంటే ట్రంప్ చాలా బెటర్ అని వాల్‌స్ట్రీట్ జర్నల్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడైంది. మొత్తం 7 స్వింగ్ రాష్ట్రాల్లో ఒక్కో చోట 600 మంది నమోదిత ఓటర్లు ఈ ఒపీనియన్ పోల్‌లో పాల్గొన్నారు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 మధ్యలో దీనిని నిర్వహించారు.
ఆ విషయాల్లో ట్రంపే బెటర్!
అరిజోనా, మిషిగన్, జార్జియాలో కమల హారిస్ ముందంజలో ఉండగా, నెవెడా, పెన్సిల్వేనియాలో ట్రంప్ ఆధిక్యం ప్రదర్శించారు. నార్త్ కరొలైనా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో ఇద్దరి మధ్య చాలా గట్టి పోటీ నెలకొంది. యుద్ధాలను డీల్ చేయడంలో కమల హారిస్ కంటే ట్రంప్ సమర్థవంతంగా పనిచేస్తారని, యుద్ధాల వేల ట్రంప్ దేశాన్ని మరింత మెరుగ్గా నడిపిస్తారని సర్వేలో అభిప్రాయం వ్యక్తమైంది. అంతేకాదు అమెరికా ఆర్థిక వ్యవస్థను, వలసదారుల సమస్యను ట్రంప్ బాగా డీల్ చేయగలరని సర్వేలో పాల్గొన్నవారు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక హౌసింగ్, ఆరోగ్య సంరక్షణ అంశాల విషయంలో హారిస్ మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారని సర్వేలో వెల్లడైంది.
పోటాపోటీ
అమెరికాలో చాలా మంది ఓటర్లు తాము ఏ పార్టీకి మద్దతిస్తామో ముందే చెబుతుంటారు. రిపబ్లికన్లుగా, డెమోక్రాట్లుగా గుర్తింపు కూడా పొందుతారు. అందువల్ల ఏయే రాష్ట్రాల్లో రిపబ్లికన్లకు, డెమోక్రాట్లకు గట్టి మద్దతు ఉందో కాస్త చూచాయగా తెలుస్తుంటుంది. అయితే ఓటింగ్ ఇదే విధంగా జరుగుతుందని చెప్పలేము. అందువల్ల ఫలితాలు తారుమారు కావచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు మాత్రం పార్టీల సిద్ధాంతాలకు కట్టుబడకుండా తటస్థంగా ఉంటారు. ఏ పార్టీనీ గుడ్డిగా నమ్మరు. ఇవే ఎన్నికల్లో కీలకంగా పరిణమించి, ఫలితాలను మార్చేస్తుంటాయి. వీటినే స్వింగ్ రాష్ట్రాలుగా పరిగణిస్తారు. పైన పేర్కొన్న ఏడు రాష్ట్రాలు అవే. ఈ సారి స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్, హారిస్ మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కమలా హారిస్‌కు మద్దతుగా ఏఆర్ రెహమాన్ వీడియో - అరగంట వింటే చాలు - ఓటర్లలో ఫుల్ జోష్ ఖాయం!
'ట్రంప్ తన అహం, డబ్బు గురించి మాత్రమే పట్టించుకుంటారు': బరాక్ ఒబామా